గాంధీ దవాఖానలో నీటి గోస

గాంధీ దవాఖానలో నీటి గోస
  • ఇబ్బందులు పడ్డ పేషెంట్లు, సహాయకులు
  • మోటర్​ కాలిపోవడంతో ఇక్కట్లు 

పద్మారావునగర్, వెలుగు : గాంధీ దవాఖానలో సోమవారం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ప్రధాన సంపు నుంచి హాస్పిటల్​బిల్డింగ్​లపైకి నీటిని పంపింగ్​చేసే ఓ మోటర్ కాలిపోవడంతో పేషెంట్లు, వారి సహాయకులు ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్​జలమండలి సెక్షన్​నుంచి నిత్యం గాంధీ ఆవరణలోని పెద్ద సంపు (7.2 లక్షల లీటర్ల కెపాసిటీ)లోకి నీరు వస్తుంది. ఇక్కడి నుంచి హాస్పిటల్ మెయిన్​ బిల్డింగ్ (ఐపీ), ఓపీ బిల్డింగ్​ తో పాటు ఇటీవల కొత్తగా నిర్మించిన ఎంసీహెచ్​బిల్డింగ్ లపై ఉన్న ఓవర్​హెడ్​ట్యాంకుల్లోకి నిత్యం 6 లక్షల లీటర్ల నీటిని పంపింగ్​ చేస్తారు.

 అక్కడి నుంచి ఆయా వార్డులు, ఆపరేషన్​థియేటర్లు, తదితర ప్రదేశాలకు నీటిని సరఫరా చేస్తారు. ఐపీ, ఓపీ బిల్డింగ్​లపై ఆరుచొప్పున , ఎంసీహెచ్​బిల్డింగ్ పై రెండు ఓవర్​హెడ్​ట్యాంకులు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ప్రధాన సంపు నుంచి ఐపీ, ఎంసీహెచ్ బిల్డింగ్​లకు నీటిని పంపు చేసే మోటర్ కాలిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దాంతో పేషెంట్లు కొన్ని గంటల పాటు నీటి కోసం ఇబ్బంది పడ్డారు.

 క్రితం రోజు పంపింగ్ చేసిన ఓవర్​హెడ్​ ట్యాంకుల్లోని నీటితో ఆపరేషన్​థియేటర్లకు ఇబ్బంది కలగలేదని వైద్యులు తెలిపారు. సర్జరీలు యథావిధిగా చేసినట్లు ఈఎన్​టీహెచ్​ఓడీ ప్రొఫెసర్​జే.భూపేందర్​సింగ్ రాథోడ్​ తెలిపారు. అయితే, కొన్ని డిపార్ట్​ మెంట్ ల్లో ఆపరేషన్ల నిర్వహణలో జాప్యం జరిగినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం సంపులో మరో పంపుసెట్టు బిగించి, నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్​డా.సునీల్, ఆర్​ఎంవో వన్​డాక్టర్​ శేషాద్రి తెలిపారు. 

రూ.50 లక్షలతో ఆరు పంపుసెట్లు కొనుగోలు

గాంధీ దవాఖాన ప్రారంభించిన సమయంలో దాదాపు 23 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన 7.5 హెచ్ పీ కెపాసిటీ కలిగిన ఆరు పంపుసెట్లనే ఇప్పటికీ వాడుతున్నారు. ఇవి చెడిపోయినప్పుడల్లా రిపేర్లు చేయిస్తూ, వాటినే వాడుతూ వస్తున్నారు. వీటిల్లోనూ రెండు మోటర్లు మాత్రమే ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి. 

అందులో ఒకటి ఆదివారం కాలిపోవడం గమనార్హం. ఇటీవల రూ.50 లక్షలతో 15 హెచ్​పీ కెపాసిటీ కలిగిన ఆరు పంపుసెట్లను కొనుగోలు చేసినట్లు టీజీఎమ్​ఎస్​ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఈ మోటర్లను ఉపయోగించి, గంటకు 2.5 లక్షల లీటర్ల నీటిని పంపింగ్​ చేయవచ్చని తెలిపారు. కొత్త పంపుసెట్లు బిగింపు పనులు పూర్తి చేసి, రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.