తిరుమలలో తీవ్ర విషాదం నెలకొంది. వైకుంఠ సర్వ దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని ఒకరిని తమిళనాడు సేలంకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. విష్ణునివాసం వద్ద టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం పార్క్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట జరిగింది.
ALSO READ | తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని టీటీపీ తెలిపింది. వైకుంఠ సర్వ దర్శనం టికెట్ల జారీ కోసం తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
2025, జనవరి 9వ తేదీ తెల్లవారుజూము 5 గంటల నుంచి వైకుంఠ సర్వ దర్శనం టోకెన్లు ప్రత్యేక కౌంటర్లలో జారీ చేస్తామని టీటీడీ భక్తులకు తెలిపింది. దీంతో సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఒకరోజు ముందుగానే (2025, జనవరి 8 బుధవారం) కౌంటర్ల ముందు బారులు తీరారు. దీంతో భక్తులు రోడ్ల మీద గుమిగూడకుండా టీటీడీ సిబ్బంది పద్మావతి పార్కులోకి పంపించారు. పార్కు నుంచి భక్తులను కౌంటర్ల క్యూలైన్లకు పంపించారు.
ఈ క్రమంలోనే భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. భక్తుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయని టీటీడీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టోకెన్ జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతోనే తోపులాట జరిగినట్లు సమాచారం. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో టీటీడీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగడానికి ఒక కారణమని భక్తులు ఆరోపించారు.