
తొగుట, వెలుగు : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ కాల్వలో ఘనపుర్, ఎల్లారెడ్డి పేట్, బండారుపల్లి గ్రామాలలో 284 మంది రైతుల నుంచి అధికారులు భూసేకరణ చేశారు. వారికి రావాల్సిన నష్టపరిహారం కోసం పలుమార్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలిశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కానీ మూడు రోజుల నుంచి నిర్వాసితులకు తొగుట తహసీల్దార్ చెక్కులు ఇవ్వకపోవడంతో శుక్రవారం రైతులు ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే ఎమ్మెల్యే 100 మంది రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యే తో మాట్లాడారు. రెండు రోజుల్లో సిద్దిపేటలో మంత్రి చేతులమీదుగా చెక్కులను పంపిణీ చేస్తామని చెప్పగా ఉదయం నుంచి మహిళా రైతులు చెక్కుల కోసం ఇక్కడే కూర్చున్నారని, చెక్కులు ఇచ్చి పంపించాలని ఎమ్మెల్యే కోరారు. దాంతో అధికారులు నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోర్టుకు పోయి ప్రభుత్వంపై కొట్లాడి తెచ్చుకున్న చెక్కులను కూడా ఇవ్వడానికి అధికారులు నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఎలాంటి గొడవలు జరగకుండా తొగుట సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు
నిర్వహించారు.