బీఆర్​ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం

బీఆర్​ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం
పటాకులు కాల్చడంతో అంటుకున్న గుడిసె.. పేలిన సిలిండర్​
ముగ్గురు మృతి.. పలువురికి తీవ్రగాయాలు
నలుగురి కాళ్లను ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఘటన

ఖమ్మం/కారేపల్లి/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ నాయకుల అత్యుత్సాహం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. పటాకులు కాల్చడంతో గుడిసెపై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో మంటల ధాటికి గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలి 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. బుధవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిందీ ఘటన. పరిస్థితి విషమించి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు చనిపోయారు. నలుగురు కాళ్లు కోల్పోయారు.

అసలు జరిగిందిదీ!

కారేపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం చీమలపాడులో ఏర్పాటు చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. పూలు చల్లుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, పటాకులు పేల్చుతూ వారికి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. పటాకులు కాల్చడంతో నిప్పురవ్వలు దగ్గర్లో ఉన్న గుడిసె మీద పడ్డాయి. గుడిసెకు తాళం వేసి ఉండటం.. గాలి కారణంగా మంటలు మొదలయ్యాయి. మరోవైపు అప్పటికే సభావేదిక దగ్గరకు చేరుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్.. ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తీసుకువచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే.. గ్రామానికి చెందిన వాటర్ ట్యాంకర్‌‌‌‌ను తెప్పించారు. అయితే గుడిసె లోపల ఉన్న సిలిండర్‌‌ను ఎవరూ గమనించలేదు. మంటలు పెరిగిపోయి.. లోపల ఉన్న గ్యాస్​ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఆ ధాటికి మంటలు ఆర్పుతున్న వారి కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. పది మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే పోలీస్ వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి ఒకరికి రెండు కాళ్లు, మరో ముగ్గురికి ఒక్కో కాలు చొప్పున డాక్టర్లు తొలగించారు. ముగ్గురిని హైదరాబాద్​కు తరలించి నిమ్స్​లో చికిత్స అందిస్తున్నారు.

మాంసపు ముద్దలు

మంటలు ఆర్పే సమయంలో పేలిన సిలిండర్ తక్కువ ఎత్తులో వేగంగా దూసుకురావడంతో కొందరి కాళ్లు ఒక్కసారిగా తెగిపడి మాంసపు ముద్దలుగా మారాయి. చత్తీస్‌‌గఢ్‌‌కు చెందిన వలస కూలీ సందీప్ రెండు కాళ్లు దెబ్బతినగా, పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి. న్యూస్ కవరేజీకి వచ్చిన ముగ్గురు రిపోర్టర్లు రామారావు, ఆంగోత్ కుమార్, తేళ్ల శ్రీనివాస్‌‌కు గాయాలయ్యాయి. బాధితులను ఖమ్మం ఆసుపత్రికి తరలించిన తర్వాత దాదాపు గంటన్నరకు ఇల్లందు నుంచి ఫైరింజన్​ ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే స్థానికులు మంటలను ఆర్పేశారు. తర్వాత ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ బోస్, ఏసీపీ బస్వారెడ్డి పరిశీలించారు. చీమలపాడు నుంచి పది మందిని జిల్లా ఆసుపత్రికి తీసుకురావడంతో.. కుటుంబ సభ్యుల రోదనలతో పరిసరాలు మిన్నంటాయి. వార్డు బయటనే తామంతా ఉన్నా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ వారి కాళ్లు తొలగించారంటూ బాధితుల బంధువులు వాపోయారు. కాళ్ల నుంచి ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపిస్తుందనే కారణంతో వాళ్లకు వెంటనే చికిత్స చేశామని, బాధితుల బంధువులకు కూడా చెప్పామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.

ఆసుపత్రి వద్ద బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ ఆందోళన

ఆసుపత్రి ముందు బీఎస్పీ నేతలు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపేశారు. తర్వాత కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీఆర్ఎస్‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముగ్గురి మృతికి కారణమైన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. తర్వాత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు ఆసుపత్రికి వచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చత్తీస్ గఢ్‌‌కు చెందిన సందీప్ భార్యకు తెలుగు రాకపోవడం, తమకు ఇక్కడెవరూ తెలిసిన వాళ్లు కూడా లేరని చెప్పడంతో తక్షణ సాయం కింద ఎమ్మెల్సీ తాతా మధు ఆమెకు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. 

ఆదుకుంటాం: ఎంపీ, ఎమ్మెల్యే

ఘటనపై జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌‌లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌‌గ్రేషియా ఇస్తామని అజయ్​ప్రకటించారు. చీమలపాడు ఘటన దురదృష్టకరమని, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని నామా నాగేశ్వరరావు తెలిపారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను తాను ఆదుకుంటానని, ఒక్కో కుటుంబానికి రూ.రెండు లక్షల చొప్పున సాయం అందజేస్తానని, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇస్తానని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రకటించారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటానని చెప్పారు.

అంబులెన్స్‌‌ను అడ్డగించి ఆందోళన

ఇద్దరి డెడ్ బాడీలను బుధవారం రాత్రి భారీ పోలీసు బందోబస్తుతో చీమలపాడు గ్రామానికి అంబులెన్స్ లో తరలించారు. బానోత్ రమేశ్, అజ్మీర మంగ్యా డెడ్ బాడీలను అంబులెన్స్ నుంచి దించనీయకుండా మృతుల బంధువులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరల్లోనే ఆపి ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు.

బాధితుల వివరాలు
    ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత.. చీమలపాడుకు చెందిన వ్యవసాయ కూలీ బానోత్ రమేశ్‌‌ (39) చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆయనకు భార్య, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. 

    అజ్మీరా మంగ్యా (38) అలియాస్ మంగు కూడా చనిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయ కూలీ పనిచేసుకుంటూ, చీమలపాడు గ్రామంలో ఐదో వార్డు మెంబర్ గా మంగు కొనసాగుతున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 

     గేట్ రేలకాయపల్లికి చెందిన ధర్మసూత్ లక్ష్మణ్ (56) ఎడమ కాలు తొలగించారు. ఆరోగ్యం విషమించడంతో లక్ష్మణ్ ను హైదరాబాద్ తరలించాలని కుటుంబ సభ్యులకు డాక్టర్లు సూచించారు. హైదరాబాద్ తరలిస్తుండగా కూసుమంచి సమీపంలోనే మృతి చెందాడు. లక్ష్మణ్ కూడా వ్యవసాయ కూలీ. భార్య సరోజ, కుమార్తెలు సరస్వతి, బిందు, రాజేశ్వరి, దుర్గ ఉన్నారు.

    చత్తీస్‌‌గఢ్‌‌కు చెందిన కూలీ సందీప్ (36 ) కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు, రెండు కాళ్లు తొలగించారు. పరిస్థితి విషమంగా ఉంది. 
    కారేపల్లి మండలం తడికలపూడి గ్రామానికి చెందిన తేజావత్ భాస్కర్ (27) ఎడమ కాలు తొలగించారు.

    వెంకట్యా తండాకు చెందిన ఆంగోత్ కుమార్ కుడి కాలు తొలగించారు.
    చీమలపాడుకు చెందిన నారటి వెంకన్న, హరిబాబు కూడా గాయపడ్డారు. 
    సీఐ గన్‌‌మెన్ నవీన్ తీవ్రంగా గాయపడి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి :  బీఎస్పీ చీఫ్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం చీమలపాడులో బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనం సభ సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర​ అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​డిమాండ్​ చేశారు. గాయపడిన వారి ట్రీట్​మెంట్​ఖర్చును పూర్తిగా బీఆర్​ఎస్​పార్టీనే భరించాలని డిమాండ్​ చేస్తూ కేటీఆర్, పువ్వాడ అజయ్​లను ట్యాగ్ చేస్తూ ట్వీట్​ చేశారు. గాయపడిన ప్రజలు, పోలీసులు, మీడియా ప్రతినిధులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘తొమ్మిదేండ్లలో ఏం వెలగబెట్టారని ఈ ఆత్మీయ సమ్మేళనాలు కేసీఆర్’ ​అంటూ ప్రవీణ్​ కుమార్​మండిపడ్డారు. ‘మీ అధికార దాహం, ధన దాహం కోసం పేదల రక్తాలు ఏరులై పారాల్నా ?  సహాయం చేద్దాం అని వెళ్లిన బీఎస్పీ, మిగతా ప్రతిపక్ష నాయకులందరినీ నిర్బంధించారు. తెలంగాణ ప్రజల ఉసురు మీకు తగలకుండా పోదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీఆర్​ఎస్​ స్వార్థ రాజకీయాలకు ముగ్గురు ఆహుతి : పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఫైర్

బీఆర్​ఎస్​ స్వార్థ రాజకీయాలకు ముగ్గురు పేదలు అగ్నికి ఆహుతయ్యారని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనం సభ దగ్గర్లో జరిగిన పేలుడు ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్..​ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో చేస్తున్న రాజకీయాలు ప్రజల పాలిట శాపంగా మారాయన్నారు. మృతుల కుటుంబాలను బీఆర్​ఎస్​ అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. గాయపడిన వారికి మంచి ట్రీట్​మెంట్​అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని పీసీసీ సీనియర్​వైస్​ ప్రెసిడెంట్​మల్లు రవి డిమాండ్​ చేశారు. గాయపడిన వారికి రూ.25 లక్షలు ఇవ్వడంతో పాటు ఉచిత ట్రీట్​మెంట్​అందించాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట పేదల జీవితాలతో ఆటలాడొద్దని హితవు పలికారు. ప్రమాదంపై కలెక్టర్​ సమగ్ర రిపోర్ట్​ తెప్పించుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు