కట్నం కోసం వేధింపులు.. ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య
మిడ్ మానేరులో దూకి బలవన్మరణం
ముందుగా పిల్లలను తోసేసి.. ఆపై తల్లి 
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం 
ప్రేమించి పెండ్లి చేసుకొని.. కట్నం తేవాలని వేధించిన భర్త

బోయినిపల్లి, వెలుగు : మతాలు వేరైనా ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకుంది. కొంత కాలానికి అతడు కట్నం కావాలని వేధింపులు మొదలుపెట్టినా ఓపికతో భరించింది. పదేండ్లు గడిచి, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేధింపులు ఆగకపోవడంతో ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వంకాయల రజిత అలియాస్ నేహా (30) పదేండ్ల కింద కరీంనగర్ లో కంప్యూటర్ శిక్షణకు వెళ్లిన టైమ్​లో కరీంనగర్​లోని సుభాష్ నగర్​కు చెందిన మహమ్మద్ అలీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. రజిత కుటుంబసభ్యులు పెండ్లికి అంగీకరించకపోవడంతో  వారిని ఎదిరించి అలీని పెండ్లి చేసుకుంది.

వారికి ముగ్గురు సంతానం మహమ్మద్ అయాన్ ( 7), ఆశ్రజబీన్ (5) , ఉస్మాన్ మహ్మద్ (14 నెలలు) కలిగారు. అయితే, పెండ్లి అయిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్న అలీ.. కట్నం తేవాలంటూ రజితను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రెండేండ్ల క్రితం ఇద్దరు పిల్లల మీద  కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై రజిత కుటుంబ సభ్యులు వేములవాడ పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టారు. ఆ తర్వాత  రాజీ కుదుర్చుకున్నారు. కొద్ది నెలల పాటు తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న రజితను ఇకపై బాగా చూసుకుంటానని నమ్మించిన అలీ కరీంనగర్​ తీసుకెళ్లాడు.

తర్వాత మళ్లీ కట్నం తేవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. డబ్బులు తీసుకురమ్మని ఈ నెల 27న భార్య రజిత,  పిల్లలను  రుద్రవరంలో దించి వెళ్లాడు. దీంతో రజిత, ఆమె  తల్లిదండ్రులతో కలిసి  వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిందని,  పోలీసులు అలీకి ఫోన్ చేయగా బక్రీద్  తర్వాత వస్తానని చెప్పాడని తెల్సింది. అయితే, భర్త వేధింపులతో విసిగిపోయిన రజిత  ఈ నెల28న కరీంనగర్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అదేరోజు కొదురుపాకలోని బ్రిడ్జి వద్దకు వెళ్లి ముందుగా ముగ్గురు పిల్లలను మిడ్ మానేరులోకి తోసేసి.. ఆపై తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు స్పాట్​కు చేరుకొని కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు.