
- లారీ ఢీకొని తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
- మెదక్‌లోని కాళ్లకల్ నేషనల్ హైవేపై ప్రమాదం
- హెల్మెట్ పెట్టుకున్నా క్లిప్పెట్టుకోకపోవడంతో పోయిన ప్రాణం
మనోహరాబాద్, వెలుగు : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ జాతీయ రహదారిపై గురువారం ఓ లారీ ఢీకొట్టడంతో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. ఎసై కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం..మెదక్ లోని రామ్ నగర్ కు చెందిన మలైక(30) తన స్కూటీపై కొడుకు మీద్ అద్నాన్ (11) కూతుళ్లు సుల్తానా(9), సిధ్రా (7) తో కలిసి హైదరాబాద్ ఫంక్షన్ కి వెళ్లింది. గురువారం ఉదయం తిరిగి పిల్లలతో కలిసి స్కూటీపై మెదక్‌కు బయలుదేరింది. ఉదయం పది గంటల సమయంలో కాళ్లకల్ జాతీయ రహదారిపై గ్లోబల్ అల్యూమినియం వద్దకు రాగానే వెనకాల నుంచి స్పీడ్‌గా వచ్చిన లారీ మలైకా స్కూటీని ఢీకొట్టి వారి పై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన మలైకా, మీద్ అద్నాన్, సుల్తానా అక్కడికక్కడే చనిపోయారు.
చిన్న కూతురు సిధ్రా స్వల్ప గాయాలతో బయటపడింది. స్కూటీ నడుపుతున్నప్పుడు మలైకా హెల్మెట్పెట్టుకున్నా క్లిప్ పెట్టుకోకపోవడంతో కింద పడిన వెంటనే హెల్మెట్ పది మీటర్ల దూరం వెళ్లి పడింది. మలైక భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. తండ్రి మహ్మద్ అహ్మ ద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్, ఎసై కరుణాకర్ రెడ్డి తెలిపారు.