రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ గ్రామంలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. చనిపోయిన వారిలో 9 ఏళ్ల చిన్నారి భానుప్రియ, ఆమె అమ్మమ్మ పర్వతమ్మ ఉన్నారు. ఇంటి బయట నిద్రిస్తుండగా ఇద్దరిని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఇంట్లో దాచిన బంగారం, నగదును ఎత్తుకెళ్లారని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.
చిన్నారి అమ్మమ్మ పార్వతమ్మను హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి రెండు టీమ్ లను ఏర్పాటు చేశామని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.