సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంత దారుణానికి ఒడిగట్టాడా : భార్యపై కోపంతో కూతురిని చంపేశాడు

ఎంత దారుణం..! ఆ పసిబిడ్డ చివరి క్షణంలో ఎంతటి నరకం అనుభవించిందో.. ! కన్న కూతురినే చంపేశాడో తండ్రి. భార్యపై ఉన్న కోపంతో ముక్కు పచ్చలారని బిడ్డను దారుణంగా అంతమొందించాడో సైకో తండ్రి. ఈ ఘటన సంచలనం రేపుతోంది ఇప్పుడు. 

అసలేం జరిగిందంటే...? 

పోలీసులు, పాప బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈయన భార్య హిమబిందు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి. ప్రస్తుతం ఉద్యోగం లేక చంద్రశేఖర్ ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా చంద్రశేఖర్ దంపతుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్లోని జ్యోతి విద్యాలయ స్కూల్‌లో చంద్రశేఖర్ దంపతుల కూతురు మోక్షజ్ఞ (9) 4వ తరగతి చదువుతోంది. శుక్రవారం (ఆగస్టు 18వ తేదీన) రోజు మోక్షజ్ఞ స్కూలుకు వెళ్లిన తండ్రి చంద్రశేఖర్.. పాపకు మాయమాటలు చెప్పి తన వెంట కారులో తీసుకెళ్లాడు. ఆ తర్వాత చిన్నారి స్కూల్కు సమీపంలోనే పెన్సిల్ కట్టర్ బ్లేడ్‌తో మోక్షజ్ఞ గొంతుకోశాడు చంద్రశేఖర్. 

ఆ తర్వాత పోలీసులకు దొరికిపోకుండా ఉండేందుకు మరో నాటకం ఆడాడు నిందితుడు. పాప హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయాడు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ORR పై డివైడర్ను కారు ఢీ కొట్టడంతో చిన్నారి హత్య విషయం బయటపడింది. కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో మోక్షజ్ఞ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. లేదంటే ఎవరికీ తెలిసేది కాదేమో..!

విషయం తెలియడంతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని చిన్నారి తల్లి, ఆమె బంధువులకు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ టౌన్షిప్ లో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. పోస్ట్మార్టం చేసిన తర్వాత చిన్నారి డెడ్బాడీని ఇంటికి తీసుకెళ్లారు. నిందితుడు చంద్రశేఖర్ను కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లి, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.