ఆస్తికోసం.. తమ్ముడిని పొడిచి చంపిన అన్న

ఆస్తికోసం.. తమ్ముడిని పొడిచి చంపిన అన్న
కామారెడ్డి జిల్లా సోనాలలో ఘటన 
మృతుడు బీఆర్​ఎస్​ నేత

పిట్లం, వెలుగు : ఆస్తి కోసం సొంత తమ్మున్ని అన్న హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాలలో ఆదివారం జరిగింది. సోనాలకు చెందిన టాక్లే విజయ్ పటేల్(32) ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ స్థానికంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నాడు. అతని అన్న రాజు పటేల్ హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు స్కూల్​లో టీచర్​గా పని చేస్తున్నాడు. వీరికి ఉమ్మడిగా10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా విజయ్ తన అన్నకు తెలియకుండా 2 ఎకరాలను తాకట్టు పెట్టాడు. ఈ విషయంపై అన్నదమ్ముల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

ఇవన్నీ మనసులో పెట్టుకున్న రాజు పటేల్ తన తమ్ముడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో పడుకుని ఉన్న విజయ్ ని పొట్టలో కత్తితో పొడిచి చంపేశాడు. అయితే, వీరి ఇంకో అన్న కూడా 2011లో మహరాష్ట్రలోని ముక్రామాబాద్ వద్ద హత్యకు గురికాగా, ఆ కేసులో రాజు పటేల్ కూడా నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ లీడర్ విజయ్ పటేల్ హత్య విషయం తెలియడంతో ఎమ్మెల్యే హన్మంత్ షిండే గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాడేను మోసి అంత్యక్రియల్లో  పాల్గొన్నారు.