తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు మృతి చెందారు. సలేశ్వరం జాతరకు భక్తులు భారీగా పోటెత్తడంతో...ఊపిరి ఆడక నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు. వనపర్తి పట్టణానికి చెందిన అభిషేక్ (32), ఆమన్ గల్ కు చెందిన విజయ్ (40) ఊపిరి ఆడక చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
పోటెత్తిన భక్తులు..
నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం జాతరకు ఈ సారి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో సలేశ్వరం ఆలయం వద్దకు వెళ్లే దారిలో యాత్రికులు బారులు తీరారు. మన్ననూర్ నుంచి సలేశ్వరం జాతరకు వచ్చే మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సలేశ్వరం జాతర కనీసం వారం నుంచి 10 రోజులపాటు నిర్వహించాలి. కానీ ఈ సారి కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో రద్దీ కారణంగా ఊపిరాడక భక్తులు మృతి చెందారు.
మూడు రోజులే నట..
నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరంలో కొలువై ఉన్న లింగమయ్య దర్శనం కోసం దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 5 కిలో మీటర్ల దూరం కాలినడకన నడవాలి. ఉగాది తర్వాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి యాత్రికులు లక్షలాదిగా తరలివస్తారు. అయితే ఈ ఏడాది సలేశ్వరం ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అడవిలోకి అనుమతిస్తున్నారు. అయితే ఈ సారి యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.