ఆసిఫాబాద్​జిల్లాలో గాలివానతో అతలాకుతలం

  • పిడుగుపడి 10 మేకలు, 4 ఆవులు, ఓ ఎద్దు మృతి
  • మందమర్రిలో కూలిన ఆవిర్భావ వేడుకల స్టాల్స్, టెంట్లు

ఆసిఫాబాద్/కోల్​బెల్ట్/జన్నారం, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లాతోపాటు మందమర్రి, జన్నారం తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఆసిఫాబాద్ మండలంలోని బెల్గాం గ్రామానికి చెందిన లోనారే హనుమంతుకు చెందిన 10 మేకలు పిడుగుపాటుకు గురై చనిపోయాయి. దాదాపు రూ.లక్షా 50 వేల నష్టం జరిగిందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని పూర్కా దౌలత్ రావ్​కు చెందిన 4 ఆవులు, చింతగూడ గ్రామానికి చెందిన రైతులు కుర్సెంగా బాధిరావుకు చెందిన ఓ ఎద్దు  పిడుగు పడి చనిపోయాయి. 

తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం మందమర్రి ఏరియా సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో వేసిన స్టాల్స్, టెంట్లు ఈదురు గాలుల కారణంగా నెలకూలాయి. సుమారు వెయ్యి కుర్చీలు, సింగరేణి ప్రగతిని తెలిపే 19 స్టాల్స్, వేడుకలను తిలకించేందుకు వచ్చే స్థానికుల కోసం భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఒక్కసారిగా  భారీ ఈదురు గాలులు రావడంతో వేసిన స్టేజ్​తోపాటు స్టాల్స్, టెంట్లు నెలకూలాయి. గంటసేపు భారీ వర్షం కురిసింది. దీంతో కల్చరల్, ప్రధాన ప్రోగ్రామ్​ను కేవలం స్టేజ్​కే పరిమితం చేశారు. జన్నారం మండలం కలమడుగులోని రాజన్న అనే వ్యక్తి ఇంటి పైకప్పు లేచిపోయింది. తపాలపూర్ సమీపంలోని మెయిన్ రోడ్డు పక్కన చెట్టు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.