తెగిన హైదరాబాద్‌‌ – విజయవాడ రహదారి.. హైవేలు, పట్టణాలు జలదిగ్బంధం

 తెగిన హైదరాబాద్‌‌ – విజయవాడ రహదారి.. హైవేలు, పట్టణాలు జలదిగ్బంధం

సూర్యాపేట, వెలుగు: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రోడ్లపై నీరు నిలిచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌‌నగర్‌‌ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి రికార్డ్‌‌స్థాయిలో వర్షం పడింది. దీంతో కోదాడ అస్తవ్యస్తంగా మారింది. మరో వైపు ప్రాజెక్ట్‌‌లకు రికార్డు స్థాయిలో వరద వస్తుండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తెగిన హైదరాబాద్‌‌ – విజయవాడ హైవే

భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో శనివారం రాత్రి సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఏపీలోని నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్‌‌ – విజయవాడ హైవేపైకి వరద భారీగా చేరింది. దీంతో హైవే తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా బంద్‌‌ చేశారు. కొద్ది సేపటి తర్వాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగించారు. కానీ మరోసారి వరద ఉధృతి పెరగడంతో హైదరాబాద్‌‌ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను నార్కట్‌‌పల్లి వద్ద, విజయవాడ నుంచి వచ్చే వాహనాలను డొనబండ వద్ద దారి మళ్లించారు.

నీటమునిగిన కోదాడ

కోదాడ పట్టణంలో శనివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉండడంతో వాగులు పొంగి లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. కోదాడలోని శ్రీమన్నారాయణకాలనీ, ఆజాద్‌‌నగర్‌‌, ఎమ్మెస్ కాలేజీ వెనుక వీధి, సాయిబాబా థియేటర్‌‌ వెనుక వైపు, నయా నగర్‌‌లోని మదర్‌‌ థెరిసా స్కూల్‌‌ వీధి, ఖమ్మం రోడ్డులోని షిర్డి సాయి నగర్‌‌తో పాటు పలు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు చేరడంతో ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌‌ సిబ్బందిని అలర్ట్‌‌ చేశారు. వరద నీటికి అడ్డంగా ఉన్న డివైడర్లు, కట్టలను జేసీబీలతో తొలగించి నీళ్లు నిల్వ ఉండకుండా ప్రయత్నాలు చేశారు.

నీట మునిగిన కాలనీలోని ప్రజలను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సబ్‌‌స్టేషన్‌‌ పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు రాత్రంతా అంధకారంలోనే గడిపారు. కోదాడ మున్సిపల్‌‌ ఆఫీస్‌‌లోకి నీళ్లు చేరడంతో రికార్డులన్నీ నీళ్ల పాలయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఉదయం కలెక్టర్ తేజస్‌‌ నందన్‌‌ లాల్‌‌, ఎస్పీ సన్‌‌ ప్రీత్‌‌ సింగ్‌‌ పరిశీలించారు. అలాగే సూర్యాపేట జిల్లాలో పలు వాగులు ఉధృతంగా పారుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

పులిచింతలకు రికార్డ్‌‌ స్థాయి వరద

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌‌కు ఎగువ నుంచి రికార్డ్‌‌ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 5,30,260 క్యూసెక్కుల ఇన్‌‌ ఫ్లో వస్తుండగా 21 గేట్లను ఎత్తి 5,63,451 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ఈ స్థాయిలో ఇన్‌‌ఫ్లో రావడం ఇదే ఫస్ట్‌‌ టైం. మరోవైపు హైదరాబాద్‌‌లో కురుస్తున్న వర్షాలకు మూసీ సైతం ఉధృతంగా పారుతోంది. దీంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌‌కు భారీగా వరద వస్తుండడంతో ఏడు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌‌కు 18 వేల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా 13 వేల క్యూసెక్కులు కిందికి వదిలేస్తున్నారు.