మావోయిస్టులపై విషప్రయోగం జరగలేదు

మావోయిస్టులపై విషప్రయోగం జరగలేదు
  • ఎదురుకాల్పుల్లోనే ఏడుగురు  మృతి చెందారు: డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ములుగు జిల్లాలో మావోయిస్టులపై విషప్రయోగం జరిగిందంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఆహారంలో విషం పెట్టి స్పృహ కోల్పోయిన తర్వాత కాల్పులు జరిపారని రాష్ట్ర పౌర హక్కుల సంఘం చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా దుష్ప్రచారం అన్నారు. 

ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ ఫార్మర్ల నెపంతో ఆదివాసీలైన ఉయిక రమేశ్, ఉయిక అర్జున్‌‌‌‌లను మావోయిస్టులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారని డీజీపీ తెలిపారు. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు. 

మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి కాల్పులకు పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లోనే ఏడుగురు సాయుధ మావోయిస్టులు మరణించారని డీజీపీ వెల్లడించారు. హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ ఆర్ సీ) సూచనల మేరకు మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహిస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లాకు చెందిన డీఎస్పీని నియమించామని చెప్పారు.