నారాయణపేట కోస్గి మండలం సర్జఖాన్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సర్జఖాన్ పేటలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘర్షణ తలెత్తింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ కార్యకర్తలపై దాడులు చేశారంటూ కోస్గి అంబేద్కర్ చౌరస్తాలో కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ధర్నాకు దిగారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా పలు చోట్ల రాజకీయ పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక పార్టీ నాయకులు, కార్యకర్తలపై మరోపార్టీ నాయకులు, కార్యకర్తలు దాడలు చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం అచ్చంపేటలోనూ ఇదే జరిగింది. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండడం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం సర్జఖాన్ ఘటనపై పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.