పాతబస్తీలో మెట్రో రైల్ కావాలంటూ నిరసన దీక్షకు పిలుపునిచ్చిన బీజేపీ

హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో రైల్ కావాలంటూ బీజేపీ నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. పాతబస్తీ లాల్ దర్వాజ మొడ్ వద్ద నిరసన దీక్షకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తుండగా.. అనుమతి లేదని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. 

కొంతమంది బీజేపీ మహిళా నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి, వ్యాన్ లో తీసుకెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో గౌలిపురా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మీ చేతికి గాయమైంది. కనీసం తాము నిరసన కూడా తెలియజేసే హక్కు లేదా..? అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అదుపులోకి తీసుకున్న వారిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

 బీజేపీ నేతలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అనుమతి లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లాల్ దర్వాజ మొడ్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరింపజేశారు.