- పదవిలో ఉన్నోళ్లు సహనంతో ఉండాలి
- సహజత్వం కోల్పోవద్దు.. వేషభాషల్లో మార్పులు రావొద్దు
- అవసరం లేని మాటలు వికటించే ప్రమాదం
- మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి
- జీహెచ్ఎంసీ కొత్త మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు జాగ్రత్తగా పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్లో ఆయనను కలిశారు. వారిని అభినందించిన సీఎం మాట్లాడుతూ.. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజాజీవితంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి అని ఆయన హెచ్చరించారు. ఇది దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పదవిలో ఉన్నోళ్లు సహనంతో సాదాసీదాగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ సహజత్వం కోల్పోవద్దని, వేషభాషల్లో మార్పులు రావొద్దని ఆయన చెప్పారు. అవసరం లేని మాటలు మాట్లాడితే కొన్ని సందర్భాల్లో వికటించే ప్రమాదముందన్నారు. ప్రజల కులం, మతం చూడకుండా ప్రతి ఒక్కరికీ సరైన గౌరవం ఇవ్వాలని, వారు చెప్పేది ఓపికగా వినాలని సీఎం సూచించారు. సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది’ వినండి
గోరటి వెంకన్న పాట ‘‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది’’ని ప్రజాప్రతినిధులు వినాలని, తాను ఆ పాటను వంద సార్లు విన్నానని కేసీఆర్ చెప్పారు. బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలన్నీ పాటలో ఉన్నాయని వాటిని అర్థం చేసుకోవాలన్నారు. బస్తీల్లో పర్యటించి ప్రజల సమస్యలు తీర్చాలని సూచించారు. మినీ ఇండియాలాంటి హైదరాబాద్ భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉందన్నారు. కార్పొరేటర్లలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారని, అందరికీ ఇవ్వలేమని చెప్పారు. తన పరిస్థితుల్లో ఎవరున్నా అంతే చేయగలరని, కలిసికట్టుగా నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నారు.