
- హైకోర్టు ఆదేశాలతో సర్కార్ ఉత్తర్వులు
- ప్రేక్షకుల భద్రత దృష్ట్యా మార్నింగ్ షోలపై నిషేధం
- రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’కూ వర్తింపు
హైదరాబాద్, వెలుగు: సినిమా టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బెనిఫిట్ షోస్ సహా స్పెషల్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు ఇక నుంచి ఎలాంటి అనుమతులు ఉండబోవని ప్రకటించింది.
ఈ నెల16 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ఇచ్చిన అనుమతులనూ వాపస్ తీస్కుం టున్నట్టుప్రకటించింది.
ఈ మేరకు శనివారం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులిచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్లను సాధారణ రేట్లకే విక్రయించాలని ఆదేశించారు. ఇవే ఉత్తర్వులు రానున్న రోజుల్లోనూ అమలులో ఉంటాయన్నారు. మార్నింగ్ షోలకు కూడా అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ‘‘గేమ్ ఛేంజర్’’ బెనిఫిట్ షోస్ సహా స్పెషల్ షోల కోసం చిత్ర యూనిట్ ప్రభుత్వ అనుమతి కోరింది.
దీంతో బెనిఫిట్ షో మినహా మల్టీప్లెక్స్ టికెట్‌కు అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్స్ టికెట్‌కు అదనంగా రూ.100 పెంపునకు రాష్ట్ర హోంశాఖ ఈ నెల 8న అనుమతిచ్చింది. జనవరి 11 నుంచి19 వరకు షోస్ నిర్వహించుకోవచ్చని తెలిపింది.
ఇందుకుగాను మల్టీప్లెక్స్ రూ.100, సింగిల్ స్క్రీన్ రూ.50 పెంపునకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే, హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సతీష్ కమల్, గొర్ల భరత్ రాజ్ అనే ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు.
టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రజల భద్రత నేపథ్యంలో స్పెషల్ షోస్‌కు అనుమతులపై ప్రభుత్వం పున:సమీక్షించాలని శుక్రవారం ఆదేశించింది. దీంతో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.