మణుగూరు, వెలుగు: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద వ్యర్థాలను శుద్ధి చేయకుండా గోదావరిలో కలపడంతో నీళ్లు కలుషితమవుతున్నాయి. దీంతో పినపాక నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీటీపీఎస్ వ్యర్థాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం కోట్లాది రూపాయలు కేటాయించినట్లు ప్రకటించినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. బూడిద వ్యర్థాలను గోదావరిలో కలపడంపై ఇక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రోగాల బారిన పబ్లిక్..
బూడిద వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతానికి దగ్గరలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌తో పాటు కార్మికుల అవసరాల కోసం సింగరేణి సరఫరా చేస్తున్న ట్యాంక్ ఉంది. ఈ రెండు చోట్ల గోదావరి జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. సింగరేణి సంస్థ సుమారు 3 వేల కుటుంబాలకు ఈ నీటిని అందిస్తుండగా, మిషన్ భగీరథ ద్వారా మణుగూరు మండలంలోని 10 వేల కుటుంబాలకు ఈ నీరు సరఫరా అవుతోంది. ఈ నీటిని తాగలేక ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నీటిని ఇతరత్రా అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. ఈ నీటిని మోటార్ల ద్వారా రైతులు పంటల సాగు కోసం వాడుకుంటుండగా, నీటితోపాటు బూడిద పంట పొలాల్లో చేరి దిగుబడి తగ్గిపోతోంది. వరికి దోమపోటు, ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. బూడిదతో భూములు నిస్సారంగా మారి ఏ పంట వేసినా వెంటనే ఎండిపోతున్నాయి. మణుగూరు మండలంలోని చిక్కుడు గుంట, సాంబాయి గూడెం, రామానుజవరం, ధమ్మక్కపేట గ్రామాల రైతుల భూములు బూడిదతో నిండిపోయాయి. మోటర్ల ద్వారా ఈ నీటిని పంపింగ్ చేయడంతో పంపుసెట్లలో బూడిద పేరుకుపోయి మోటర్లు కాలిపోతున్నాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న మోటర్లు బూడిదలో కూరుకుపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్క చిక్కుడు గుంట గ్రామంలోనే పదుల సంఖ్యలో మోటర్లు కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటీపీఎస్ నుంచి వచ్చే ఈ వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతం మొత్తం బూడిద దిబ్బగా తయారై ఆ ప్రాంతంలో ఉన్న చేపలు చనిపోతున్నాయి. ఈ నీటిని తాగిన పశువులకు చర్మ సంబంధిత రోగాలతో పాటు సొంగ కారుతోందని రైతులు తెలిపారు.
నేరుగా గోదావరిలోకే..
ప్రతి రోజు బీటీపీఎస్ నుంచి 6 వేల టన్నుల బూడిద వ్యర్థాలు వెలువడుతున్నాయి. వీటిలో 500 టన్నుల బూడిదను లారీల ద్వారా వివిధ అవసరాలకు బయటకు పంపిస్తున్నారు. మిగిలిన 5500 టన్నుల బూడిద వ్యర్థాలను నిలువ చేసేందుకు యాష్ పాండ్ లేని కారణంగా 6 నెలలుగా పైప్ లైన్ ద్వారా మద్ది వాగులోకి పంపిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారు. 2 యాష్ పాండ్ లు నిర్మించాల్సి ఉండగా, ఒకటి మాత్రమే పూర్తి చేశారు. ఆ యాష్ పాండ్ ఆరు నెలల క్రితమే పూర్తిగా నిండిపోయింది.
అడుగు పెట్టే పరిస్థితి లేదు..
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వస్తున్న బూడిదను శుద్ధి చేయకుండా గోదావరిలో కలపడంతో నీళ్లు బూడిదతో నిండిపోయి ముట్టుకునే పరిస్థితి లేదు. నీరు తాగిన వారికి రోగాలు వస్తున్నాయి. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు.
- జంపన సీతారామరాజు, రైతు
పొలాలు ఎండిపోతున్నాయ్
గోదావరి నీళ్లను పొలాలకు వాడితే బూడిద కుప్పలుగా మారిపోతున్నాయి. వరి పంటకు రోగాలు వస్తున్నాయి. మోటార్లు తరచూ రిపేర్లకు రావడంతో వాటికి మరమ్మతులు చేయించలేక ఇబ్బంది పడుతున్నాం.
- కోర్సా అచ్చాలు, రైతు