ఏఐ... మనిషి ఆవిష్కరణల్లో ఒక అద్భుతం అని చెప్పాలి. మొదట్లో మ్యాన్ పవర్ తగ్గించటం కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగపడిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... ఇప్పుడు ఒక కొత్త లోకాన్ని సృష్టించగల స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఏఐ వల్ల కలిగే లాభాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది.. ఈ సమ్మిట్ వేదికగా ఎన్నో అద్భుతాలకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్.
ఏఐ గ్లోబల్ సమిట్‌లో పలు స్టార్టప్‌లు, సంస్థల ఆవిష్కరణలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అగ్రికల్చర్ నుంచి హెల్త్ వరకు.. ఎడ్యుకేషన్ నుంచి సర్వీస్ అందించే రోబోల దాకా.. చెరువుల కబ్జాలను గుర్తుపట్టే టూల్స్ నుంచి.. కరెంట్ వాడకంపై అలర్ట్ ఇచ్చి బిల్లుల భారాన్ని తగ్గించే స్మార్ట్ మీటర్ల వరకు.. తప్పు ఆసనాలు వేస్తే హెచ్చరించే స్మార్ట్ యోగా మ్యాట్ల వరకు ఎన్నెన్నో ఆవిష్కరణలు ఏఐ సమిట్‌లో దర్శనమిచ్చాయి. - – వెలుగు, హైదరాబాద్
ఎవుసం చేసే ఏఐ బండి
తనంతట తానే పురుగుల మందు స్ప్రే చేసే ఓ ఏఐ చిట్టి బండి ‘ఎకర్+’ని ఎక్స్మెషీన్స్ అనే హైదరాబాద్ సంస్థ తయారు చేసింది. 50 లీటర్ల వరకు క్యాన్‌ను మోసుకెళ్తూ మనుషుల అవ సరం లేకుండా పొలమంతా అది పురుగుల మందు కొట్టేస్తుంది. అంతేకాకుండా.. విత్తనాలు పెడుతుంది.. మొక్కలు నాటుతుంది.. కలుపును ఏరేస్తుంది.. పంట చేతికొచ్చాక కో స్తుంది కూడా. దానికి తగ్గట్టు ఆ వెహికల్‌ను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది సంస్థ. ఇది ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఏఐ వెహికల్ కావడం విశేషం. కలుపు మొక్కలను ఏరేసే క్రమంలో ఏది కలుపు మొక్కో.. ఏది అవసరమొచ్చేదో తెలుసుకునేలా ఏఐ ప్రోగ్రామ్‌ను ఆ సంస్థ చేసిపెట్టింది.
చెరువుల కబ్జా లెక్కలు తీస్తది!
చెరువుల లెక్కలు తీసే సొల్యూషన్‌తో వచ్చింది గరుడలైటిక్స్ అనే సంస్థ. చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీ ఎల్, బఫర్‌జోన్‌ను నిర్ధారించి.. కబ్జాలను నివారించేలా ఏఐ టూల్‌ను సంస్థ రూపొందించింది. జియో స్పేషియల్ డేటా ఆధారంగా ఈ ఏఐ టూల్ పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. కబ్జాకు గురైనట్టు తేలితే వెంటనే ఏఐ సిస్టమ్‌కు అలర్ట్ వెళ్తుందని వివరిస్తున్నారు. తద్వారా వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
హార్ట్ బీట్‌ను మానిటర్ చేసే రింగ్
ఇటీవలి కాలంలో గుండెపోట్లు ఎక్కువైపోతున్నాయి. సడన్‌గా కుప్పకూలి చనిపోతున్నారు. ఈ క్రమంలోనే చేతి వేలికి పెట్టుకున్న ఓ చిన్న రింగ్ హార్ట్‌బీట్‌ను పసిగట్టి మనకు అలర్ట్ ఇచ్చేస్తే.. అలాంటి రింగ్‌నే తయారు చేసింది వింట్రాన్ అనే సంస్థ. బ్లూటూత్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేసుకునే ఈ రింగ్‌తో మన గుండెలోని రిథమ్ తేడా వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు దాని ద్వారా మనం గుండె పనితీరును అంచనా వేసుకోవచ్చు. అంతేకాదు.. మహిళలు మెన్స్ట్రువల్ సైకిల్‌ను మానిటర్ చేసుకునేందుకు వీలుంటుంది. ఒక్క ఫింగర్ టిప్‌తో మన గుండె ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవడంతో పాటు.. ఇటు ట్రెండీగానూ ఉండేందుకు ఈ రింగ్ ఉపకరిస్తుంది.
కారులో ఉంటే.. రోడ్ల కండిషన్స్‌ను ముందే చెప్తది!
మనం వెళ్లే దారిలో రోడ్ల పరిస్థితి ఏమిటో వివరించేందుకు రోడ్విషన్ఏఐ అనే సంస్థ ఏఐ టూల్‌ను రూపొందించింది. కార్లలో ఇన్స్టాల్ చేసుకునే ఈ పరికరం.. మన ముందున్న రోడ్డు పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తుంది. వెంటనే అలర్ట్ ఇస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఎడ్జబుల్ అనే మరో సంస్థ కూడా రోడ్లపై పాట్‌హోల్స్‌ను గుర్తించే ఓ ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అంతేకాదు.. రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్‌లో జనాల కదలికలను నిరోధించేలా కూడా ఈ ఏఐ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
కరెంట్ బిల్లును ఆదా చేసే స్మార్ట్ ప్లగ్
అవసరం లేకున్నా ఫ్యాన్లు వేస్తుంటాం. లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఫలితంగా కరెంట్ బిల్లు భారీగా వచ్చేస్తుంటుంది. ఈ వేస్టేజ్‌ను అరికట్టి.. బిల్లును తగ్గించు కునే మార్గం లేదా? అంటే ఉంది అంటున్నది భారత్ స్మార్ట్ సర్వీసెస్ అనే సంస్థ. ఓ ఏఐ పవర్డ్ స్మార్ట్ ప్లగ్, స్మార్ట్ ఆడిటర్‌ను తయారు చేసింది. స్మార్ట్ ఆడిటర్‌ను మీటర్‌కు లేదంటే మెయిన్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు కరెంట్ వాడకా న్ని మానిటర్ చేసుకోవచ్చని చెబుతున్నది. అంతేకాదు.. ఇంట్లో ఉండే పరికరాలు ఏవి ఎక్కువ కరెంట్ కాలుస్తున్నాయో కూడా ఈ స్మార్ట్ ఆడిటర్ పసిగట్టేస్తుంది. వెంటనే మొబైల్లో ఉండే యాప్‌కు అలర్ట్ ఇస్తుందట.
ఆసనం తప్పుగా వేస్తే ఊకోదు!
యోగాకు మ్యాట్ కూడా ఓ ఇంపార్టెంట్ వస్తువైపోయింది. మ్యాట్ కథ ఎలా ఉన్నా.. చాలా మంది వేసి వేయరాక ఒక్కోసారి ఆసనాల్లో పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి సందర్భంలో స్మార్ట్ యోగా మ్యాట్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు దాని తయారీదారులు. అవును, యోగిఫై అనే సంస్థ ఒక స్మార్ట్ యోగా మ్యాట్‌ను తయారు చేసింది. అందులో సెన్సర్లను ఏర్పాటు చేసింది. ఒక్క ఆసనం తప్పుగా వేసినా.. వెంటనే అందులోని సెన్సర్లు వార్నింగ్ బెల్‌ను మోగించేస్తాయి. మనం ఆసనాలను కరెక్ట్ చేసుకునే దాకా ఆ అలారం మోగుతూనే ఉంటుంది.