క్షత్రియులకు ఇవి నిషేధం.. జూదం ఆడటం.. మోసం చేయడం మహాపాపం

క్షత్రియులకు ఇవి నిషేధం.. జూదం ఆడటం.. మోసం చేయడం మహాపాపం

క్షత్త్ర నీతిక్రమంబులు గావు సూవె నికృతియును జూదమును....ధర్మనిత్యులైన వారికీ రెండు వర్జింపవలయు నెందు ...బాపవృత్తంబు జూదంబు పార్థివులకు. ...మోసం చేయడం, జూదం ఆడటం.. క్షత్రియ ధర్మానికి తగినవి కావు. ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాళ్లు ఈ రెంటినీ వదిలేయాలి. 

రాజులు జూదమాడటం పాపపు పని... అని  (సభా పర్వం ద్వితీయాశ్వాసం, 166 వ పద్యం) ధర్మరాజు పలికాడు. ఇంకా...‘మరియు మాయా ద్యూతంబున జయించుట మహా పాతకంబనియును, ధర్మ ద్యూతంబున జయించుట ధర్మ యుద్ధంబున జయించునంతియ పుణ్యంబనియును నసితుండయిన దేవలుండు చెప్పెనని ధర్మరాజు పలికాడు.

జూదం ఆడటమే దోషమనుకుంటే, మాయా జూదం ఆడటం మహా పాతకమని, నిజాయితీగా ఆడి జూదం గెలిస్తే.. అది ధర్మ యుద్ధంలో గెలిచినప్పుడు వచ్చిన పుణ్యంతో సమానమని దేవలుడు చెప్పినట్లుగా ధర్మరాజు పలికాడు.నన్నయ కవితా లక్షణాలలో ‘నానా రుచిరార్థ సూక్తినిధి’ అని ఒక లక్షణం ఉంది. నన్నయ రాసినది రెండున్నర పర్వాలే అయినప్పటికీ, ఎంతో నీతిని బోధించాడు. ఎన్నో సూక్తులు అంటే మంచి మాటలను మనకు అందించాడు. 

క్షత్రియులకు ఉండవలసిన నియమాలను ఈ పద్యంలో విపులీకరించాడు. ప్రజలను పరిపాలించే రాజులు ( నేటి ప్రజా పాలకులు ) ఇతరులను మోసం చేయకూడదు. జూదం ఆడకూడదు. ఈ రెండు పనుల వల్ల తన ఏలుబడిలోని ప్రజలు నష్టపోతారు. రాజు మోసం చేయటం మొదలుపెడితే, ‘యథా రాజా తథా ప్రజా’ అన్న చందాన ప్రజలంతా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉంటారు. అలాగే రాజు స్వయంగా జూదం ఆడితే, ప్రజలు కూడా రాజును అనుసరిస్తారు. 

ఇది ఒక విధం

రాజు జూదం ఆడితే రాజ్యం నాశనం అయిపోతుందనడానికి ధర్మరాజు గొప్ప ఉదాహరణ. పెద్దల మాటను కాదనడని తెలిసిన శకుని...ధృతరాష్ట్రుడిని ఒప్పించి విదురునితో కబురు పంపి ధర్మరాజును రప్పించాడు. అప్పటికీ విదురుడు ముందుగానే ధృతరాష్ట్రునికి నీతి బోధ చేశాడు. అన్నదమ్ముల మధ్య జూదం మంచిది కాదని (నల మహారాజు కథ వివరించాడు ), అది వారి మధ్య యుద్ధానికి దారి తీస్తుందని చెప్పినా, పుత్ర ప్రేమతో కళ్లు మూసుకుపోయిన ధృతరాష్ట్రుడు, విదురుని మాటలను లక్ష్యపెట్టలేదు. 

జూదం ఆడటం ఇష్టం లేకపోయినా, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, దుర్యోధనుని ఆహ్వానాన్ని మన్నించి ఆటకు కూర్చున్నాడు ధర్మరాజు. తన తరఫున శకుని పాచికలు వేస్తాడని దుర్యోధనుడు పలుకగా, ఒకరి తరఫున ఒకరు ఆడటం ధర్మ విరుద్ధం అని పలికాడు ధర్మరాజు. ఏమైతేనేం ధర్మరాజు చెప్పినట్లుగానే మోసం చేసి, కపట జూదం ఆడి వారి సర్వ సంపదలు హరించి, పాండవులను అరణ్యాల పాలు చేశాడు శకుని సహాయంతో దుర్యోధనుడు. 

 ఒప్పందం ప్రకారం పాండవులు పదమూడు సంవత్సరాల తరువాత తమ రాజ్యాన్ని తమకు ఇవ్వవలసినదిగా కోరినప్పటికీ, ‘వాడి సూది మొన మోపినంత నేలను కూడా ఇవ్వను’ అని తన మోసాన్ని కొనసాగించాడు. కురుక్షేత్ర యుద్ధంలో.. పదిమంది కలిసి నిరాయుధుడుగా ఉన్న అభిమన్యుని మోసంతో సంహరించారు. మొదటి నుంచీ దుర్యోధనుడు మోసం చేస్తూనే వచ్చాడు.

బాల్యంలో పాండవులతో ఆడుకున్నది మొదలుగా దుర్యోధనుడు మోసం చేస్తూనే ఉన్నాడు. భీముడికి అన్నంలో విషం కలిపించాడు, తాళ్లతో కట్టి పాతాళంలోకి తోయించాడు. లక్క ఇల్లు నిర్మింప చేసి తగుల పెట్టించాడు. ఎన్ని మోసాలు చేసినా దుర్యోధనుడు ఏనాడూ జయం సాధించలేదు. మోసంతో చేసే పనికి ఎన్నడూ విజయం లభించదు. న్యాయమార్గాన ప్రవర్తించిన వారికి అంతిమంగా విజయం లభిస్తుందనడానికి పాండవుల జీవితమే ప్రత్యక్ష నిదర్శనం.

నలుడి కథ

నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ దేవతలు ఆశీర్వాదాలు పలికారు.  అంతటి మహాచక్రవర్తికి జూదం అనే బలహీనత ఉంది.  కలి ప్రభావం కారణంగా.. తన సోదరుడు పుష్కరుడు ఆడిన కపట జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నలదమయంతులు అడవుల పాలయ్యారు. పడరాని కష్టాలు పడ్డాడు. 

కలి ప్రభావాన్ని(అంటే జూదం ) అధిగమించి, తన రాజ్యాన్ని పొంది, దమయంతిని కలుసుకున్నాడు. జూదం అనే వ్యసనం కారణంగా నల మహారాజు పడరాని పాట్లు పడ్డాడు. పంచతంత్ర కథలలో ‘కొంగ – చేపలు – ఎండ్రకాయ’ కథలో కొంత కపటంతోను, మోసంతోను చేపలను నమ్మించి, వాటిని ఆహారంగా తీసుకుంది. ఆ మోసం ఎంతో కాలం సాగలేదు. కొంగ కపటాన్ని గ్రహించిన ఎండ్రకాయ, కొంగ మెడను కొరికి చంపేసింది.

కోడి పందాలు అనే జూదం వంటి మరొక వ్యసనం కారణంగా ‘పల్నాటి యుద్ధం’ జరిగింది. నమ్మకద్రోహం అనే మరో మోసం కారణంగా ‘బొబ్బిలి యుద్ధం’ జరిగింది.మోసంతో ఎన్నో అరాచకాలు జరిగాయి.

- డా. పురాణపండ వైజయంతి–