ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన MLAల చేత ఎన్నుకోబడి వారు శాసనమండలిలో అడుగు పెట్టనున్నారు. వారి పేర్లును కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి సోమవారం ప్రకటించాయి. టిడిపి నేత సి. రామచంద్రయ్య, జనసేన పార్టీ నాయకుడు పిడుగు హరిప్రసాద్ పేర్లను శాసనమండలికి ఖరారు చేశారు. వీరు మంగళవారం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
జనసేనా పార్టీ అభ్యర్థి పి. హరి ప్రసాద్ జర్నలిస్టుగా పని చేశారు. పవన్ కల్యాణ్ పార్టీ పట్టడంతో ఆయన సలహాదారుడిగా నియమితులయ్యారు. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో నిలిచే అవకాశం దక్కింది. సి. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలంగా మంత్రిగా, ఎంపీగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశాడు. 2018 లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్ వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.