
న్యూఢిల్లీ: నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానుంది. ఎల్‌పీజీ (వంటగ్యాస్) రేట్లు, యూపీఐ, ఎన్‌హెచ్‌ఏఐ టోల్ వంటి చాలా అంశాలకు సంబంధించి వివిధ మార్పులు అమల్లోకి రానున్నాయి. మీ ఇంటి బడ్జెట్‌పై వీటి ప్రభావం డైరెక్ట్‌గా ఉంటుంది. కంపెనీలు పీఎన్‌జీ రేట్లను కూడా సవరించే అవకాశం ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ కీలకమైన మార్గాల్లో కొత్త టోల్ రేట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున రోడ్డు ప్రయాణం మరింత ఖరీదు కానుంది.
ఎన్‌హెచ్‌ఏఐ టోల్ సవరణ: ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన హైవేలపై టోల్ రేట్లను సవరించింది. ధరలను కనిష్టంగా ఐదు రూపాయలు, గరిష్టంగా పది రూపాయలు పెంచనుంది. ఫలితంగా ఇతర రవాణా మార్గాల చార్జీలు కూడా పెరగొచ్చు. లక్నో–కాన్పూర్, వారణాసి-– గోరఖ్‌పూర్, లక్నో–-అయోధ్య వంటి కీలక మార్గాల్లో టోల్ ఛార్జీలు పెరిగాయి. కొన్ని హైవేలకు చార్జీలను తగ్గిస్తామని కూడా ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది.
కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న తన బడ్జెట్ ప్రసంగంలో కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. దీంతో ఏడాదికి రూ. 12 లక్షల సీటీసీ జీతం పొందే వ్యక్తి కొత్త పన్ను విధానం కింద ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులు అదనంగా రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందే వీలుంది. దీంతో రూ.12.75 లక్షల ఆదాయం వరకు వీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త పన్ను శ్లాబులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తాయి.
యూపీఐలో మార్పులు: డిజిటల్ చెల్లింపులలో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న యూపీఐతో లింకైన మొబైల్ నంబర్లను బ్యాంకులు తమ రికార్డ్‌ల నుంచి తొలగిస్తాయి. ఫలితంగా ఈ నెంబర్లకు యూపీఐ చెల్లింపులు జరగవు.
యూపీఎస్ పోర్టల్ ప్రారంభం: ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పోర్టల్‌ను ప్రభుత్వం త్వరలో లాంచ్ చేస్తుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ పోర్టల్ వచ్చాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యూపీఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. దాదాపు 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉందని అంచనా.
డిజిలాకర్, జీఎస్‌టీ మార్పులు: ఇన్వెస్టర్లు తమ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (సీఏఎస్), డీమాట్ ఖాతాల హోల్డింగ్ స్టేట్‌మెంట్‌లను నేరుగా డిజిలాకర్‌లో నిల్వ చేసే సౌకర్యాన్ని ఏప్రిల్ 1 నుంచి పొందుతారు. మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలంటే మరిన్ని వివరాలను సమర్పించవలసి ఉంటుంది. మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్ అందుబాటులోకి వస్తుంది.