మేడారం తొవ్వలో చూడాల్సినయెన్నో.. 

మేడారం తొవ్వలో చూడాల్సినయెన్నో.. 

ఏటూరు నాగారం, వెలుగు: మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చే భక్తులు, రెండు రోజులు టూర్​ ప్లాన్​ చేసుకుంటే పనిలో పనిగా పలు ఆధ్యాత్మిక, టూరిస్టు ప్లేసులను చూసి వెళ్లొచ్చు. ఏ రూట్​లో వచ్చేవారు, ఏయే లోకేషన్లు విజిట్ ​చేయవచ్చో, అక్కడికి ఎలా వెళ్లాలో, ఎంత దూరం ఉంటాయో, ఆ విశేషాలేంటో చదవండి.
 

వరంగల్​ కోట 
వరంగల్​ కోట ప్రతి ఒక్కరూ చూడాల్సిన చారిత్రక స్థలం. దీనినే ఖిలా వరంగల్ అంటారు. వరంగల్​ రైల్వే స్టేషన్, బస్​స్టేషన్​​ నుంచి సుమారు 3 కిలోమీటర్లు,  హనుమకొండ బస్​ స్టేషన్​ నుంచి 8.7 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయుల కళానైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే కట్టడం ఇది. ఈ కోట నిర్మాణాన్ని 13వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు ప్రారంభించగా.. ఆయన బిడ్డ రాణి రుద్రమా దేవి పూర్తి చేశారు. ఇక్కడున్న ఖుష్ మహల్, రాతికోట, చిల్డ్రన్ పార్క్ టూరిస్ట్ లను ఆకర్షిస్తాయి. 
 

భద్రకాళి టెంపుల్​
వరంగల్​ రైల్వే స్టేషన్, బస్​స్టేషన్​ నుంచి 4.5 కిలో మీటర్లు, హనుమకొండ బస్​ స్టేషన్​ నుంచి 4.4 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది భద్రకాళి టెంపుల్. ఈ ఆలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉంటుంది. అందులో మునులు తపస్సు చేసేవారని చెప్తుంటారు. గుడికి ఎదురుగా పెద్ద చెరువు ఉండగా, కట్టను భద్రకాళి బండ్ గా డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం కంప్లీట్ కావడంతో టూరిస్టులతో కళకళలాడుతోంది.  
 

వేయి స్తంభాల గుడి...
హనుమకొండ నుంచి ములుగు వెళ్లే మెయిన్​ రోడ్డుపై  వేయిస్తంభాల ఆలయం ఉంది. హనుమకొండ బస్టాండ్​ నుంచి 2.4 కిలోమీటర్లు, వరంగల్​ రైల్వే స్టేషన్, బస్​ స్టేషన్​ నుంచి 5.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయుల కళానైపుణ్యానికి ఈ టెంపుల్​ ప్రతీకగా నిలుస్తుంది. రుద్రేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయంలో శివ లింగం ఉంటుంది.  ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా నల్లరాతి శిలతో చేసిన నందీశ్వరుడు, కల్యాణ మండపం ఉంటాయి (కల్యాణ మండపం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది). కాగా కాకతీయులు ఇక్కడి నుంచి ఓరుగల్లు కోటకు వెళ్లే రహస్య సొరంగ మార్గం కూడా ఉంటుంది.
 

శ్రీకాళేశ్వర– ముక్తీశ్వర  దేవాలయం
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ మండలంలోని అటవీ ప్రాంతంలో ఉంది. వరంగల్​ నుంచి భూపాలపల్లి మీదుగా128 కిలోమీటర్లు వెళ్తే కాళేశ్వరం టెంపుల్ చేరుకోవచ్చు. ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతి నదితో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడింది. 
 

కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం టెంపుల్​ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అన్నారం బ్యారేజీ అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంపుహౌజ్​ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ చేరుకోవాలంటే కాళేశ్వరం వెళ్లక ముందే మహదేవ్​పూ‌‌ర్​నుంచి టర్న్​ అయ్యి 15 కిలో మీటర్లు వెళ్లాలి. 
 

రామప్ప టెంపుల్​
రామప్ప టెంపుల్ ములుగు జిల్లాలోని వెంకటపూర్ మండలం పాలంపేటలో ఉంది. హన్మకొండలోని ములుగు రోడ్డు నుంచి 163 నేషనల్​ హైవేపై జంగాలపల్లి క్రాస్ మీదుగా 60 కిలో మీటర్లు వెళ్తే పాలంపేటకు, అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంవెళ్తే  రామప్ప చేరుకోవచ్చు. ములుగు నుంచి రామప్పకు బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. తిరుగు ప్రయాణంలో వన్​వే ఉంటుంది గనుక మేడారం పోయేటప్పుడే రామప్ప వెళ్తే బెటర్​. తిరుగుప్రయాణంలో రావాలనుకుంటే భూపాలపల్లి, ములుగు గణపురం క్రాస్ మీదుగా రామప్ప చేరుకోవచ్చు.
లక్నవరం...
మేడారం మార్గంలో 163 నేషనల్​ హైవేపై  గోవిందరావుపేట మండలం చల్వాయి క్రాస్​ దాకా వచ్చి  బుస్సాపురం మీదుగా లక్నవరం చేరుకోవచ్చు. చల్వాయి నుంచి 9 కిలోమీటర్లు. ఒకవేళ రామప్ప టెంపుల్​నుంచి రావాలంటే 40 కిలో మీటర్లు ఉంటుంది. ట్రాఫిక్​ సమస్యల వల్ల 11 నుంచి 20 వరకు లక్నవరం సందర్శనను నిలిపేశారు. 20వ తేదీ తర్వాత వచ్చే వాళ్లు మాత్రమే లక్నవరం తిలకించే చాన్స్​ఉంటది.
ఏటూరు నాగారం వైపు నుంచి వచ్చే వాళ్లు.. 
శ్రీహేమాచల క్షేత్రం...
ఇది రెండో యాదగిరి గుట్టగా పేరు పొందింది. మల్లూరులోని గుట్టపైన శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి స్వయంభువుగా వెలిసిట్లు చెబుతారు. ఇక్కడ చింతామణి అనే జలధార నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. గుట్టలపై నుంచి జాలువారే  నీళ్లను తాగితే  సర్వ రోగాలు పోతాయని భక్తుల  విశ్వాసం.  బూర్గంపాడు, ఏటూరునాగారం దారిలో మంగపేట మండలం మల్లూరు నుంచి కొండపైకి 4.3 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ములుగు నుంచి 82,   ఏటూరునాగారం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
బొగత జలపాతం...
తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన బొగత జలపాతం  ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉంది. జూన్ నుంచి ఆగస్టు వరకు నిండుగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం సన్నటి ధార మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడి ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుంది. ఏటూరునాగారం నుంచి 24 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. 

మేడారానికి గాలిమోటరు రెడీ !
హనుమకొండ నుంచి పోను రాను రూ.20 వేలు
మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం హెలీకాప్టర్ సేవలను ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిస్ట్రిక్ట్ ​టూరిజం ఆఫీసర్​ శివాజీ తెలిపారు. బెంగుళూరుకు చెందిన తుంబి ఏవియేషన్​ సంస్థ సర్వీసులు నడిపిస్తుందన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి హెలీకాప్టర్​లో మేడారానికి రాను పోను ఒక్కరికి రూ. 20 వేలు  తీసుకోనుంది. మేడారంలో ఏరియల్ వ్యూ కోసం ఒక్కొక్కరికి రూ. 3700  తీసుకుంటారు. బుకింగ్, వివరాలకు 9400399999, 9880505905 నంబర్లలో సంప్రదించాలని, info@helitaxii.com కు మెయిల్ ​కూడా చేయవచ్చన్నారు.                                                                         - ఏటూరునాగారం, వెలుగు