ప్రధాని మోదీతో యూఎస్ వైస్ ప్రసిడెంట్ జేడీ వాన్స్ చర్చించిన అంశాలు ఇవే..

 ప్రధాని మోదీతో యూఎస్ వైస్ ప్రసిడెంట్ జేడీ వాన్స్ చర్చించిన అంశాలు ఇవే..

భారత పర్యటనకు వచ్చిన అమెరికా వైస్ ప్రసిడెంట్ జేడీ వాన్స్.. సోమవారం (ఏప్రిల్ 21) సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రసిడెంట్ ట్రంప్ టారిఫ్ లు ఎడాపెడా విధిస్తున్న తరుణంలో.. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ అధికారిక నివాస గృహంలో ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ముఖ్యంగా టారిఫ్ లపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాదిలో రానుండటంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లో వాన్స్ తో మోదీ అన్నారు. 

ప్రపంచ దేశాలపై టారిఫ్ విధించిన ట్రంప్.. తాత్కాలికంగా 90 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవలే మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ ను కలిసిన విషయం తెలిసిందే. ఇండియన్ వస్తువులపై 26 శాతం టారిఫ్ విధిస్తూ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో జేడీ వాన్స్ 4 రోజుల భారత పర్యటనకు వచ్చారు. 

అమెరికా, భారత్ కు సంబంధించిన కీలక అంశాలపై ఇరు నేతలు చర్చించారు. ఇండియా, యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు. ఇరు దేశాలకు పరస్పరంగా మంచి జరిగేలా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. 

ఇరు దేశాల ప్రజలకు లాభం కలిగించేలా చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశంలో నేతలు అంగీకరించినట్లు ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.