గడియారంలో సెకన్లు మారుతున్నట్టే టెక్నాలజీలో ట్రెండ్స్ మారుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవ్వాళ, ఇవ్వాల్టి కంటే రేపు.. ఇలా ఏ రోజుకారోజు టెక్ ట్రెండ్స్ వస్తున్నాయి. కొత్త గ్యాడ్జెట్లు, కొత్త ఫీచర్లతో టెక్ దునియాలో కొత్త మార్పులు వస్తున్నాయి. బ్రాండెడ్ కంపెనీలు ఇటు గ్యాడ్జెట్ల లాంచింగ్‌లో, ఫీచర్ల అప్డేట్లలో పోటీపడుతూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలా మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకూ తమ టెక్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి.ఈ మధ్య వచ్చిన ఆ కొత్త అప్డేట్స్ మీ కోసం..
స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలంతా దాన్ని ఫాలో అవుతారు. ఇంటర్వెల్, లంచ్, చుట్టీ బెల్ ఇలా స్కూల్ బెల్‌ను బట్టి పిల్లలు టైం ఫాలో అవుతారు. అలాంటి స్కూల్ బెల్ లాంటిదే ఫ్యామిలీ బెల్. ఇది ఫ్యామిలీ మెంబర్స్‌ను కలుపుతుంది. ఎక్కడెక్కడో బిజీ బిజీగా ఉన్న వాళ్లను అలర్ట్ చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటి టైమింగ్స్‌ను ఇందులో సేవ్ చేసి పెట్టాలి. ఈ ఫీచర్‌కు కనెక్ట్ అయి ఉన్న ఫోన్స్ అన్నింటికీ ఆ టైమింగ్స్‌లో అలర్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది. దీని ద్వారా వేరే పనుల్లో ఉన్నవాళ్లంతా ఒక్కదగ్గరికి చేరడానికి వీలుంటుంది. కేవలం హోం షెడ్యూల్‌నే కాదు, అవుట్ డోర్, పిక్నిక్, హాలీడే టైమింగ్స్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది.
డిజిటల్ కీ
గూగుల్ నుంచి వస్తున్న మరో ఫీచర్ డిజిటల్ కారు కీ. కారు స్టార్ట్ చేయాలన్నా, లాక్, అన్‌లాక్ చేయాలన్నా కీ కావాలి. దానికి అదనంగా రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు గూగుల్ ఫీచర్‌తో కారును ఫోన్‌తో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆ ఫీచరే డిజిటల్ కీ. ఆండ్రాయిడ్ ఫోన్‌తో కీ లేకున్నా కారును కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే లాంచ్ చేయబోతోంది గూగుల్. అలాగే.. గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రొ, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 లాంటి ఫోన్లలో, బీఎండబ్ల్యూ కార్ల కోసం ఈ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను ఐఫోన్ తెచ్చింది. అయితే అది కొన్ని లగ్జరీ కార్లకు మాత్రమే పని చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ స్వెటర్
మైక్రోసాఫ్ట్ టెక్ కంపెనీ ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసింది? అది ఏ గాడ్జెట్టో, ల్యాప్‌టాపో అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే... అదొక స్వెటర్. ఏటా క్రిస్మస్‌కు మైక్రోసాఫ్ట్ వెరైటీ స్వెటర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది కూడా క్రిస్మస్‌కు ‘మైన్‌స్వీపర్ ఆగ్లీ’ అనే పేరుతో స్వెటర్‌ను విడుదల చేసింది. 1990 నుంచి ప్రతి ఏడాది క్రిస్మస్ కు ఈ స్వెటర్లను లాంచ్ చేస్తోంది. వీటి సేల్స్ ద్వారా వచ్చే డబ్బును కొన్ని సేవా సంస్థలకు అందజేస్తోంది. కిందటి ఏడాది స్వెటర్ల డబ్బులను ‘గర్ల్స్ హూ కోడ్ ఫౌండేషన్’ అనే ఫౌండేషన్‌కు ఇచ్చింది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఈ స్వెటర్ ధర 74.99 డాలర్లు అంటే సుమారు రూ. 5,600. స్మాల్, లార్జ్, మీడియమ్, ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్ ఎల్, త్రిబుల్ ఎక్సెఎల్ సైజుల్లో లభిస్తుంది.