భగవంతుణ్ని అనుసరించే విధానాలు ఎన్నున్నా..అన్నింటి గమ్యం ఒక్కటే. అదే భగవంతుడికి చేరువ కావడం. పూజలు చేయడం, దైవ నామ స్మరణ చేయడం, ధ్యానం చేయడం ఇలా ఎవరికి వీలైన విధానాన్ని వాళ్లు అనుసరిస్తారు. అయితే చాలా మందిలో ఏది ఉత్తమ మార్గం అనే సందేహం ఉంటుంది. దీనికి మన పురాణాల్లో సమాధానం ఉంది. అదే నవ విధ భక్తి మార్గాలు..
దేవుడిని చేరుకునేందుకు భక్తి విధానాల్ని గురించి శ్రీరాముడు, లక్ష్మణునికి వివరించినట్లు రామాయణంలో ఉంది.. అలాగే మూల భాగవతంలోనూ నవ విధ భక్తులను గురించి బమ్మెర పోతన ప్రస్తావించాడు. ఆయన ఓ పద్యంలో వీటిని వివరించాడు. అలాగే శ్లోకంలోనూ తొమ్మిది భక్తి విధానాల గురించి ఉంది..
శ్లోకం:
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్
అర్చనం వన్దనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్
పద్యం:
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్. సత్యంబు దైత్యోత్తమా!
Also Read :- ఆరో రోజు పాశురం.. గోపికను నిద్ర లేపటానికి వెళ్లిన వాళ్లకు..!
పై పద్యంలోనూ, శ్లోకంలోనూ నవవిధ భక్తుల గురించిన వివరణ ఉంది. అవి 1. శ్రవణం 2. కీర్తనం 3. స్మరణం 4. పాదసేవనం 5. అర్చనం 6. వందనం 7. దాస్యం 8. సఖ్యం 9. ఆత్మనివేదనం.
- శ్రవణం: దేవుడికి సంబంధించి కీర్తనలు, శ్లోకాలు, నామాలు, మంత్రాలు వంటివి ఏవి విన్నా అది భక్తి మార్గం కిందికే వస్తుంది. అయితే వీటిని వింటున్నప్పుడు మనసును వాటి మీదే లగ్నం చేయాలి.
- కీర్తనం: భగవంతుడిని కీర్తించడం మరో మార్గం. అంటే దేవుడికి సంబంధించిన విశిష్టతను, లీలలను పొగడటం. మహిమల్ని తలచుకోవడం, దేవుడి కీర్తనలు, పాటలుపాడటం వంటివి కీర్తనలో భాగమే.
- స్మరణ: నిత్యం దేవుడిని స్మరించుకోవడం ఒక మార్గం. ఏ పని చేస్తున్నా మనసులో, వీలుంటే బయటికి ఇష్ట దైవాన్ని తలచుకోవాలి. ఆయన రూపాన్ని, మహిమల్ని స్మరించుకోవాలి. ఎలా తలచుకున్నా దేవుడి అనుగ్రహం లభిస్తుంది.. కలియుగంలో దైవ నామస్మరణమే ఉత్తమ మార్గమని చాలా మంది గురువులు చెప్పే మాట. ప్రహ్లాదులు. మునులు వంటి వాళ్లు దైవ నామ స్మరణ ద్వారానే దేవుడికి చేరువయ్యారు. కల్మషం లేని మనసుతో భగవంతుడ్ని స్మరిస్తే తగిన ఫలితం లభిస్తుంది.
- పాదసేవ: భక్తిని గురించి వివరిస్తూ, జ్ఞానాన్ని బోధించే గురువుల పాదాలను సేవించడం వల్ల భగవంతుడికి చేరువ కాగలుగుతారు. అలాగే మనస్సులో భక్తులు భగవంతుడి దివ్య చరణాలను తలచుకున్నా శుభప్రదమే. ప్రహ్లాదుడు నిత్యం శ్రీవారి పాదాలను సేవిస్తూ ఉంటాడని పురాణం చెబుతోంది. అలాగే భరతుడు రాముడి పాదుకలనే పూజించిన సంగతి తెలిసిందే.
- అర్చనం: పూజించడం వల్ల దేవుడికి మరింత చేరువ కావొచ్చు. విగ్రహాలు, దేవుడి ప్రతిమల్ని పుష్పాలు, ఫలాలు, ఆకులతో అలంకరించి జలంతో కొలవడం అర్చనా విధానాలు.. దూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ శక్తిమేర పూజ చేయాలి.
- వందనం: ఎదురుగా ఉన్న దేవుడి ప్రతిమకు లేదా మనసులో దేవుడ్ని తలచుకుని సమస్కారం చేసినా ఫలితం దక్కుతుంది. గురువులకు నమస్కరించినా మంచిదే. దీనివల్ల మనకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చినవాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు.
- దాస్యం: సేవకుడిగా, భక్తుడిగా దేవుడికి ఎలాంటి పని చేసేందుకైనా సిద్ధంగా ఉండటమే దాస్యం. ఇష్ట దైవానికి సేవచేసేందుకు మొహమాటం, అహానికి తావివ్వకూడదు. దేవుడి కోసం ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి.
- సఖ్యం: భగవంతుడు దూరంగా ఉన్నాడనే భావనతో కాకుండా, మనకు పక్కనే సన్నిహితుడిగా ఉన్నాడని భావించాలి. ఆయనతో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆయనలో స్నేహితుడిని, తల్లిని, తండ్రిని, సోదరుడ్ని చూడాలి. అప్పుడు దైవానికి మరింత దగ్గరవుతాం.
- ఆత్మ నివేదనం: మానవ జన్మను నడిపించే ఆత్మనే భగవంతుడికి సమర్పించడమే ఆత్మనివేదనం. మనల్ని మనం పూర్తిగా భగవంతుడికి అంకితం చేసి. ఆయన సేవలో గడపడమే ఆత్మ నివేదనం.
-వెలుగు,లైఫ్-