రాష్ట్రాల ఏర్పాటు
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెద్ద మొత్తంలో పెరిగాయి. దాంతో రాష్ట్రాల పునర్విభజన ఒక శాశ్వత ప్రాతిపదికన ఉండాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌ను అధ్యయనం చేయాలని ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను 1953 డిసెంబర్లో నియమించారు. ఈ కమిషన్ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం (1956), ఏడో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్–ఎ, పార్ట్–బి మధ్య భేదం తొలగించారు. అలాగే పార్ట్–సి రాష్ట్రాలను రద్దు చేశారు. వాటి స్థానంలో 1956 నవంబర్ 1న 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, బాంబే, జమ్ముకశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, మినికాయ్, అమీన్దీవి దీవులు, మణిపూర్, త్రిపుర ఉండేవి.
1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు
గుజరాత్ (15వ రాష్ట్రం): 1960లో బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం – 1960 ద్వారా ద్విభాష రాష్ట్రమైన బాంబేను రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. బాంబే రాష్ట్రం నుంచి గుజరాతీ మాట్లాడే ప్రాంతాల ప్రజలకు గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో భారతదేశంలో 15వ రాష్ట్రంగా గుజరాత్ ఆవిర్భవించింది. గుజరాత్ రాష్ట్ర విభజన అనంతరం మిగిలిన అవశేష బాంబే రాష్ట్రాన్ని మహారాష్ట్ర పేరుగా మార్చారు.
నాగాలాండ్ (16వ రాష్ట్రం): నాగాలాండ్ రాష్ట్ర చట్టం – 1962 ద్వారా అస్సాం నుంచి నాగా కొండ ప్రాంతాలను, ట్యూయోన్సాంగ్ ప్రాంతాలను వేరు చేసి 1963లో నాగాలాండ్ రాష్ట్రాన్ని 16వ రాష్ట్రంగా ఏర్పర్చారు.
హర్యానా (17వ రాష్ట్రం): మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలో అకాలీదళ్ ప్రత్యేక సిక్కుల భూమి కోసం ఉద్యమించింది. దాంతో ప్రభుత్వం షా కమిషన్‌ను నియమించింది. షా కమిషన్ సూచన మేరకు పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 1966 ఆధారంగా పంజాబీ మాట్లాడే ప్రాంతాలను కలిపి పంజాబ్‌ను హిందీ మాట్లాడే ప్రాంతాలను కలిపి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పర్చారు. ఈ విధంగా భారతదేశంలో 17వ రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం ఆవిర్భవించింది.
హిమాచల్‌ప్రదేశ్ (18వ రాష్ట్రం): పాత పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత మిగిలిన కొండ ప్రాంతాలను పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్‌లో కలిపారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర చట్టం – 1970 ఆధారంగా 1971లో కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్‌ప్రదేశ్‌కు రాష్ట్ర హోదాను కల్పిస్తూ 18వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
మణిపూర్, త్రిపుర, మేఘాలయ: ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం – 1971 ద్వారా 1972 జనవరి 21న మణిపూర్, త్రిపుర, మేఘాలయ అనే మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్ కు రాష్ట్ర హోదాను కల్పిస్తూ 19వ రాష్ట్రంగా, కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురకు కూడా రాష్ట్ర హోదాను కల్పిస్తూ 20వ రాష్ట్రంగా, 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా అస్సాంలో ఉపరాష్ట్రంగా హోదా పొందిన మేఘాలయకు ఈ చట్టం ద్వారా సంపూర్ణ రాష్ట్ర స్థాయి కల్పించి 21వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా అస్సాం నుంచి రెండు ప్రాంతాలను వేరు చేసి మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు.
మిజోరాం: 1986లో కేంద్ర ప్రభుత్వానికి మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య కుదరిన మిజోరాం శాంతి ఒప్పందం ఫలితంగా మిజోరాం 23వ రాష్ట్రంగా ఏర్పడింది. దీనికోసం మిజోరాం రాష్ట్ర చట్టం – 1986 చేసి, 53వ రాజ్యాంగ సవరణ కూడా చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్: 1972 నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌కు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం – 1986 చేసి 55వ రాజ్యాంగ సవరణ ద్వారా 1987 ఫిబ్రవరి 20న సంపూర్ణ రాష్ట్ర స్థాయి హోదా కల్పించారు. దాంతో అరుణాచల్‌ప్రదేశ్ భారతదేశంలో 24వ రాష్ట్రంగా ఏర్పడింది.
గోవా(25వ రాష్ట్రం): పోర్చుగీస్ వారి నుంచి పొందిన గోవా, డయ్యుడామన్లను 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. 1987లో 56వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా, డామన్, డయ్యూ పునర్వ్యవస్థీకరణ చట్టం – 1987 చేసి డయ్యు డామన్‌ల నుంచి గోవాను విడదీసి గోవాకు సంపూర్ణ రాష్ట్ర పతిపత్తిని కల్పించారు.
చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్: మధ్యప్రదేశ్ నుంచి విడదీసి చత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని 2000, నవంబర్ 1న 26వ రాష్ట్రంగా, ఉత్తరప్రదేశ్ నుంచి విడదీసి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని 2000, నవంబర్ 9న 27వ రాష్ట్రంగా, బిహార్ నుంచి విడదీసి జార్ఖండ్ రాష్ట్రాన్ని 2000 నవంబర్ 15న 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
తెలంగాణ (29వ రాష్ట్రం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పర్చారు.
సిక్కిం (22వ రాష్ట్రం): భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి సిక్కిం చోగ్యాల్ రాజ వంశస్తుల పరిపాలనలో ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సిక్కిం రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచారం వంటి బాధ్యతలను భారత ప్రభుత్వం చేపట్టింది. 1974లో 35వ రాజ్యాంగ సవరణ చేసి సిక్కింను అసోసియేట్ రాష్ట్ర హోదాను కల్పించారు. దీనికోసం రాజ్యాంగంలో 2–ఎ అనే కొత్త ఆర్టికల్‌ను, పదో షెడ్యూల్‌ను చేర్చారు. కానీ 1975లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు భారతదేశంలో సిక్కింను శాశ్వత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. దాంతో 1975లో చేసిన 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం 22వ రాష్ట్రంగా అవతరించింది.
ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మొదటి, నాలుగో షెడ్యూల్స్ సవరించబడ్డాయి. అలాగే సిక్కిం పరిపాలనకు సంబంధించిన ప్రత్యేక అంశాలతో 371ఎఫ్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ఈ విధంగా సిక్కింను శాశ్వత రాష్ట్రంగా చేయడంతో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 2(ఎ), పదో షెడ్యూల్లోని అంశాలను తొలగించారు.
కేంద్రపాలిత ప్రాంతాలు
దాద్రా, నగర్ హవేలి: పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఈ భూభాగం 1954లో విముక్తి పొందింది. 1961లో 10వ రాజ్యాంగ సవరణ చేసి దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
డామన్, డయ్యు: 1961లో భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టి పోర్చుగీసు వారి నుంచి గోవా, డామన్ డయ్యు ప్రాంతాలను పొందారు. 1962లో 12వ రాజ్యాంగ సవరణ చేసి వీటిని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. కానీ 1987లో గోవాకు రాష్ట్ర హోదా ఇచ్చారు. డామన్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతోంది.
పుదుచ్చేరి: పూర్వపు ఫ్రెంచ్ స్థావరాలైన పుదుచ్చేరి, కరైకాల్, మాహే, యానాం అనే నాలుగు ప్రాంతాలు పుదుచ్చేరి భూభాగంలో ఉండేవి. ఈ భూభాగాన్ని 1954లో ఫ్రెంచి వారు భారత్ కు అప్పగించారు. దాంతో ఈ భాగాన్ని 1962 వరకు ఆర్జిత భూభాగంగా పరిపాలించారు. 1962లో 14వ రాజ్యాంగ సవరణ చేసి దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
చండీగఢ్: పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 1966 ఆధారంగా చండీగఢ్‌ను
పంజాబ్, హర్యానాకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా చేసి దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
జమ్ముకశ్మీర్, లడఖ్: ఆర్టికల్ 370 ద్వారా జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా ఉండేది. కానీ 2019లో జారీ చేసిన రాష్ట్రపతి రాజ్యాంగ ఉత్తర్వు (జమ్ముకశ్మీర్ వర్తింపు - 2019) జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా తొలగించ బడింది. అంటే ఈ ఉత్తర్వులు 1954లో జారీ చేసిన రాజ్యాంగ ఉత్తర్వు (జమ్ముకశ్మీర్‌కి వర్తింపు - 1954)ను అధిగమించాయి. అలాగే 2019లో జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేశారు. దీని ఆధారంగా పూర్వపు జమ్ముకశ్మీర్‌లోని లేహ్, కార్గిల్ జిల్లాలను కలిపి లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా అదేవిధంగా జమ్ముకశ్మీర్‌లో మిగతా 20 జిల్లాలను కలిపి జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఈ జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019, అక్టోబర్ 31 నుంచి అమలులోకి వచ్చింది.