
హైటెక్ యుగంలో జనాలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలకులు కూడా పేరుకే రామరాజ్యం అంటారు కాని.. అదెక్కడ ఆచరణలో లేదు. అసలు ప్రజలు ఎలా ఉండాలి.. పాలకులు ఎలా ఉండాలి.. కొడుకు ఎలా ఉండాలి? కోడలు ఎలా ఉండాలి? అసలు మనిషి ఎలా ఉండాలో చూపించినారు సీతారాములు.
భక్తులమని చెప్పుకునేటోళ్లు.. బొట్టు పెట్టుకుని.. కొబ్బరి కాయలు కొడితే సరిపోదు. వాళ్లు భక్తులుగా మారినందుకు ఆ దేవుళ్లు నడిచిన దారిలో నడవాలి. వాళ్లు చేసిన ఉపకారం చేతనైనంత మందికి చెయ్యాలి!
ఏం నేర్చుకోవాలె?
రాముడిలో ఎన్నో ఉత్తమ గుణాలను గుర్తించారు వాల్మీకి మహర్షి. అవన్నీ ఇప్పటికీ ఆచరించదగినవి.. ఆచారించాల్సినవి. అందంగా, ప్రేమగా మాట్లాడటం రాముడికే సాధ్యం. కోపంగా మాట్లాడేవారి దగ్గర... వెర్రికేకలు వేసే వాళ్ల దగ్గర రాముడు సమాధానం చెప్పడు. ఆ క్షణంలో మౌనంగా ఉంటాడు. దెబ్బ తిన్నాక వాళ్లే మారుతారని ఆయన నమ్మకం. అంతకుముందు వంద అపకారాలు చేసినా.. ఒక్క ఉపకారం చేస్తే.. వాళ్లని ఎన్నోసార్లు స్మరించుకుంటాడు. ఎవరు అపకారం చేసినా గుర్తు చేసుకోడు. 'ఇది మంచిది.. ఇది కాదు' అని జడ్జ్ చెయ్యగల బుద్ధికుశలత ఉన్నవాడు. ఇతరులను ద్వేషించడు. ఆయన మధురభాషి.. ఆయన మాట్లాడుతంటే వినేవాళ్లకు సంతోషం కలుగుతుందట.
►ALSO READ | Sriramanavami Special: శ్రీరాముడు ఏంచెప్పాడు.. రామరాజ్యం ఎలా సాగింది..
పూర్వభాషిత్వం... తనే ముందే మాట్లాడుతాడు. ఎవరూ కలిసినా.. 'అయ్యా బాగున్నవా? 'అని ప్రియంగా మాట్లాడుతాడు. అంతేగాని.. 'ఏం సార్ ఎదిగిపోయారు.. మేమెక్కడ కనపడ్తం మీకు'అని ఎటకారంగా ఎన్నడూ ముచ్చట మొదలుపెట్టడు. పాఠాలు గుర్తొచ్చినప్పుడు తన గురువులను స్మరించుకుంటాడు. అన్నింటికన్నా గొప్పగుణం సాత్వికులను ఎలా రక్షించాలో రాముడికి తెలుసు.
ఎలా సంపాదించాలి. ఎంత ఖర్చుపెట్టాలో కూడా ఆయనకు తెలుసు. తనకు కావాల్సిన వాటికోసం ఖర్చు పెట్టకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్టు. తనకు అవసరం లేకున్న వృథా ఖర్చు చేస్తే.. భావితరాలకు ద్రోహం చేస్తున్నట్టని ఆనాడే చెప్పాడు. .. శ్రీరామచంద్రుడు. ఇన్ని గుణాలు ఉన్నందుకే ఆయన మర్యాద రాముడు అనిపించుకున్నాడు. పుణ్యం కోసం రామనామం స్మరించడంలో నిజమైన భక్తి లేదు. సీతారాముల మార్గాన్ని అనుసరించి, ఆచరించడమే అసలు భక్తి. అట్ల చేస్తే మిమ్మల్ని మీరు సంస్కరించుకున్నట్టే. తద్వారా సమాజాన్ని కూడా సంస్కరించినట్లే...