గ్రూప్ I ప్రిలిమ్స్ గైడ్​లైన్స్​ ఇవే..  

తెలంగాణలో ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్​సీ) కఠిన నిబంధనలను అమలు చేయనుంది. ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తోంది.  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.  

అభ్యర్థులను  ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఎగ్జామ్ ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు గేట్లు మూయనున్నారు.  ఉదయం 10.15 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.  ఒకరోజు ముందుగానే పరీక్ష సెంటర్​ని సందర్శిస్తే తరువాత రోజు అడ్రస్​ విషయంలో ఇబ్బంది పడకుండా ఉంటారని వారు చెబుతున్నారు. పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, క్యాలుకులేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగ్జామ్ సెంటర్ల లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.  బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌లను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు.

 

 హాల్​టిక్కెట్ తో పాటు పాస్​పోర్ట్​, ఓటర్​ ఐడీ, ఆధార్​ తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఒకటైనా తమ వెంట తీసుకురావాలని సూచించారు. ఓఎంఆర్​ షీట్​లో వైట్ నర్​, చాక్ పౌడర్​, బ్లేడ్​, ఎరేజర్​లాంటివి వాడకూడదని తెలిపారు. అభ్యర్థులు బూట్లు ధరించి రాకూడదని, చెప్పులతో రావాలని సూచించారు.  కేంద్రంలో ఎలాంటి స్లోగన్స్‌ ఇవ్వకూడదని, ఇతరులతో మాట్లాడడం, ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే ఎలాంటి ప్రయత్నం చేసినా కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ తెలిపింది.  అభ్యర్థులను రెండు దశల్లో  తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని.. భవిష్యత్ లో  నిర్వహించే ఎలాంటి పరీక్షలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.