క్యాష్ రిచ్ లీగ్‌గాపేరొందిన ఐపీఎల్ ద్వారా భారత ఆటగాళ్లపై కనక వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. వారి వారి ఆటతీరు, ప్రదర్శనను బట్టి లక్షలు మొదలు కోట్లలో వెనకేసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఆటగాళ్లలో అహంకారం పెరిగిపోతోందని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్‍దేవ్ చెప్పుకొచ్చారు.
కొన్నిరోజుల క్రితం భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ టీమిండియా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లే క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు సలహాల కోసం తమను సంప్రదించే వారని, కానీ ఇప్పటి ఆటగాళ్లలో అలాంటి లక్షణాలు కనిపించట్లేదని చెప్పారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కపిల్ దేవ్.. గవాస్కర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ భారత యువ ఆటగాళ్ళకు ఏమీ తెలియకపోయినా.. అన్నీ తమకే తెలుసనే భావనలో ఉన్నారని తెలిపారు.
"ఐపీఎల్ ద్వారా కెరీర్ ఆరంభంలోనే ఆటగాళ్లకు డబ్బు వస్తోంది. దీనివల్ల వారిలో అహంకారం పెరిగిపోతోంది. అందువల్లే సీనియర్లను ఏవైనా సలహాలు అడిగేందుకు వారికి ఇగో అడ్డొస్తోంది. ఏమీ తెలియకపోయినా.. అన్నీ మాకే తెలుసని అనుకుంటున్నారు. అదే ఒకప్పటి ఆటగాళ్లకు.. ఇప్పటి క్రికెటర్లకు తేడా."
"50 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న సునీల్ గవాస్కర్ ప్రస్తుతం వెస్టిండీస్‌లోనే ఉన్నారు. ఎవరైనా యువ ఆటగాళ్లు ఆయన దగ్గరికి వెళ్లి, విలువైన సలహాలు తీసుకోవడానికి ప్రయత్నించారా? ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారా? కొన్నిసార్లు వినడం కూడా మీ ఆలోచనలను మార్చగలదు.." అంటూ కపిల్ దేవ్.. భారత యువ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Former World Cup-winning captain Kapil Dev is not happy with current-era cricketers' arrogance. pic.twitter.com/qkBpD8u7sm
— CricTracker (@Cricketracker) July 30, 2023