
తెలంగాణలో వాతావరణం గంట గంటకూ మారిపోతుంది. ఉదయం చల్లగా అనిపించినా మధ్యాహ్నం లోపు ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయంత్రం లోపే మళ్లీ వాతావరణం చల్లబడుతోంది. ఒక్కసారిగా ఈదురు గాలులు, మేఘాలతో వర్షాకాలాన్ని తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం మిశ్రమంగా కనిపిస్తోంది. అయితే రానున్న రెండు రోజులు ఎండలు మరింత మండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న రెండు రోజులు రాష్టానికి ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సోమ, మంగళవారం (ఏప్రిల్ 14,15) ఎండలు దంచి కొట్టనున్నాయని, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఇవాళ, రేపు (ఆది, సోమ వారం) వడ గాల్పులు వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారి చేశారు. మధ్యాహ్నం 11 నుండి 3 గంటల మధ్య బైటికి రావద్దని imd (India Meteorological Department) సూచించింది. నిన్న (శనివారం) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రానున్న రెండు రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉంది. ఈరోజు (ఆదివారం) అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు అధిక ఎండలతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు.
పలు జిల్లాలకు వర్ష సూచన:
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోని, చక్రవాకపు ఆవర్తనంతో పాటు అధిక ఎండల తో ఏర్పడుతున్న క్యుమిలో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీతో వేగంతో వీస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
►ALSO READ | తెలంగాణలో కార్చిచ్చు... నిర్మల్ జిల్లాలో తగలబడుతున్న అడవులు
ఇవాళ(ఆదివారం) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు (సోమవారం) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.