బీఎండబ్ల్యూ కారు ఉన్నోళ్లకూ పింఛన్! ఫైనాన్స్ డిపార్ట్​మెంట్‌‌లో అక్రమాలు

బీఎండబ్ల్యూ కారు ఉన్నోళ్లకూ పింఛన్!  ఫైనాన్స్ డిపార్ట్​మెంట్‌‌లో అక్రమాలు

తిరువనంతపురం: వృద్ధులు, దివ్యాంగులు వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్‌‌ను సంపన్నులు పొందుతున్నారు. బీఎండబ్ల్యూ కారు, ఇంట్లో ఏసీ, 2వేల స్క్వేర్​ యార్డ్​కంటే ఎక్కువ స్థలంలో విలాసవంతమైన భవనాలు ఉన్నోళ్లు కూడా ప్రతినెలా ఠంచన్​గా ప్రభుత్వ  పింఛన్​ అందుకుంటున్నారు. కేరళలోని మలప్పురం కొటక్కల్​ మున్సిపాలిటీలో ఆ రాష్ట్ర ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ నిర్వహించిన ఆడిట్​లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి.

సర్కారు పింఛన్ అందుకుంటున్నవారిలో గెజిటెడ్‌‌ అధికారులు, కాలేజీ ప్రొఫెసర్లుసహా1498 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తేలగా.. ఈ అక్రమాలపై నిగ్గుతేల్చాలని విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ను ఆ రాష్ట్ర సర్కారు ఆదేశించింది. మొత్తం 42 మందిపై విజిలెన్స్​ విచారణ జరపగా.. అందులో 38 మందికి పింఛన్​ పొందే అర్హత లేదని, అందులో కొందరు ప్రాణాలతోనే లేరని తేలింది. ఇందులో బీఎండబ్ల్యూ కార్లు, ఏసీలున్న విలాస భవనాలు ఉన్నవారు కూడా ఉన్నట్టు తేలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పింఛన్​ రికవరీకి ఆదేశం

సంపన్నులు, ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ ఇస్తుండడంపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్​ బాలగోపాల్​ సీరియస్​ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా  ఆడిట్​ నిర్వహించాలని ఆదేశించారు. అర్హతలేని వారిని పింఛన్​ జాబితానుంచి తొలగించాలని సూచించారు. ఇప్పటివరకూ తీసుకున్న పింఛన్​ను రికవరీ చేయాలని ఆదేశించారు. వారికి అర్హత, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన రెవెన్యూ, పింఛన్​ ఆమోదించిన అధికారులపై కూడా విజిలెన్స్​విచారణ జరపాలని ఆర్డర్స్​ జారీ చేశారు. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను వెంటనే నివేదించాలని ఆర్థిక శాఖ పరిపాలనా విభాగాలను ఆదేశించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.