గరుడ పురాణం : ఈ తప్పులు చేశారా.. తరువాత జన్మలో మీ రూపం ఇదే...

గరుడ పురాణం :  ఈ తప్పులు చేశారా.. తరువాత జన్మలో మీ రూపం ఇదే...

హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో వివరించబడింది.  మానవుడి జీవితానికి మోక్షం లభించి మరుజన్మ ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా ఉండాలంటే ఈ తప్పులు చేయకూడదు. రుడ పురాణం ప్రకారం కొన్ని తప్పులు చేస్తే మరుజన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం.

ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణం చదువుతారు. ఎందుకంటే వారి దశదిన కర్మ జరిగే లోపు గరుడ పురాణం చదివితే వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని, మరుజన్మ ఉండదని నమ్ముతారు. మనం చేసే కొన్ని తప్పులు వచ్చే జన్మని నిర్ణయిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి జీవితం లభిస్తుంది. అదే చెడు పనులు చేస్తే మాత్రం కష్టతరమైన జీవితం జీవించాల్సి వస్తుంది.

బ్రాహ్మణ హత్య: పంచ మహా పాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. వీటికి పాప క్షమాపణ అనేది ఉండదు. వాటి ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. బ్రాహ్మణులను హింసించినా.. అవమానపరచినా ...   బ్రాహ్మణులను చంపిన వ్యక్తి గరుడ పురాణం ప్రకారం మరుజన్మలో కుక్క, పంది లేదా గాడిదగా పుడతాడట. 

గోహత్య : పంచమహా పాతకాలలో ఇది కూడా ఒకటి. గోహత్య చేసిన వ్యక్తి వచ్చే జన్మలో ఒంటె,  ఎలుక లేదా సర్పజాతిలో పుడతాడట. 

దొంగతనం : బంగారం దొంగిలించిన వ్యక్తి వచ్చే జన్మలో కుష్టు వ్యాధితో బాధపడే వ్యక్తిగా జన్మిస్తాడని అంటారు. అలాగే ఇతర దొంగతనాలు చేసే వ్యక్తి ఎలుకగా పుడతాడు. 

గురువును, అధికారిని  అగౌరవపరిస్తే : గురువు దైవంతో సమానం అంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం పొందే వ్యక్తి గురువు. అటువంటి గురువును అగౌరవపరిచిన వ్యక్తులు చెవులు లేని వాళ్ళుగా చెవిటి వాళ్ళగా పుడతారు. 

చెడు అలవాట్లు ఉంటే : మద్యం సేవించడం, వ్యభిచారం చేయడం వంటి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులు వచ్చే జన్మలో పురుగులు, కుక్క లేదా పందిగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది. 

హింసకు చేసేవాళ్ళు : హింసకు పాల్పడే వాళ్ళని, ఇతరులను హింసించి పైశాచికానందం పొందే వాళ్ళు వచ్చే జన్మలో రాక్షసులుగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది. 

అబద్ధాలు చెప్తే : అబద్ధాలు చెప్పడం, ఇతరులను నమ్మించి మోసం చేయడం, ఇతరులకు ద్రోహం తలపెట్టే వ్యక్తులు మరుజన్మలో కుక్కగా పుడతారు. లోభంతో ప్రవర్తించే వాళ్ళు వచ్చే జన్మలో పాముగా పుడతారని అంటారు. 

దానం చేయకపోతే: ఒక మనిషి అనేవాడు తన జీవితంలో కచ్చితంగా దానధర్మాలు చేయాలట. దానధర్మమే ప్రతి మనిషి మతం. దానం చేయకపోతే సమస్యలు పెరుగుతాయి. అలాగే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడని గరుడ పురాణం చెబుతోంది. దానం చేసిన వ్యక్తి వద్ద మాత్రం డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదట. చేయని వ్యక్తులకు సంపాదించినది కోల్పోవడమే కాగా....  ఆందోళన కూడా నిత్యం వారిని వెంటాడుతూనే ఉంటుందట. 

లోభిలాగా ప్రవర్తిస్తే: గరుడ పురాణం ప్రకారం.. ధనవంతుడు ఎప్పుడూ లోపభూయిష్టంగా లేదా లోభిలాగా ప్రవర్తించకూడదని చెబుతోంది. ఎందుకంటే అలా ప్రవర్తిస్తే.. ఎంత ధనవంతుడైనా ఏదో ఒక నాడు పేదవాడిగా మారిపోతాడట. అంతే కాదు, డబ్బు విషయంలో అహం ఎక్కువగా ఉండే వ్యక్తికి ఎప్పటికీ డబ్బు ఉండదని అంటారు. అలాంటి వారిపై లక్ష్మీదేవికి కోపం వస్తుందని, వారి దగ్గర లక్ష్మీదేవి ఉండటానికి కూడా ఇష్టపడదట.గరుడ పురాణం ప్రకారం డబ్బుపై దురాశతో మరొకరిని మోసం చేసే వ్యక్తి ఎప్పుడూ సమస్యలతో బాధపడుతుంటాడు. కాబట్టి ఎవ్వరూ ఎవరినీ డబ్బుతో మోసం చేయకూడదు.

గరుడ పురాణం పేరు వినేందుకు చాలా మంది భయపడతారు. ఇది ఇంట్లో ఉండటం మంచిది కాదని అంటుంటారు. ఇందులో మానవుడు చేసే పాపాలు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పాపాలకు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం, పుణ్యం   సంపాదించుకునేందుకు అవలంభించాల్సిన వివిధ మార్గాలు అనేవి ఈ పురాణంలో స్పష్టంగా ఉంటాయి. ఇందులో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి. 

అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. వ్యాసమహర్షి దీనిని రచించాడు. వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఇది. మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఉపదేశించిన పురాణంగా చెప్తారు. అందుకే దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది.  మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతారు. మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలను కూడా పొందుపరిచారు.