
- యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టు హెచ్చరిక
- రణ్ వీర్ పాడ్ కాస్ట్ తిరిగి ప్రారంభించుకునేందుకు ఓకే
- అతి పనికిరాదని మరో యూట్యూబర్ సమయ్ రైనాకు చురకలు
న్యూఢిల్లీ: బూతులు మాట్లాడటం, వాటిని ప్రమోట్ చేయడమే టాలెంట్ అనుకోవద్దని వివాదాస్పద యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాను సుప్రీంకోర్టు హెచ్చరించింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టమున్నట్లు మాట్లాడితే ఎవరూ ఉపేక్షించరని తేల్చిచెప్పింది. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో ఇటీవల యూట్యూబర్లు రణ్వీర్ అల్హాబాదియా, సమయ్ రైనా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రణ్వీర్ పాడ్‌కాస్ట్ ప్రసారాలను ఆపేయాలని ఆదేశించింది. తన మాటలకు రణ్వీర్ క్షమాపణలు కూడా చెప్పారు. తన పాడ్ కాస్ట్ ద్వారా 280 మంది ఉపాధి పొందుతున్నారని, తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని మళ్లీ సుప్రీంను ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు అనుమతిచ్చింది.
ఈ సందర్భంగా రణ్‌వీర్‌తోపాటు మరో యూట్యూబర్ సమయ్ రైనాను తీవ్రంగా మందలించింది. బూతులు మాట్లాడటమే టాలెంట్ అనుకోవద్దని, సభ్య సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరించింది. ‘‘చెత్తనంతా పోగు చేసి మాట్లాడటం టాలెంట్ కాదు. 75 ఏండ్ల వ్యక్తి కూడా కుటుంబమంతా చూసేలా హాస్య షోలు నిర్వహిస్తున్నరు. అదీ టాలెంట్ అంటే. మీరు బూతులనే టాలెంట్ అనుకుంటే కుదరదు” అని తేల్చిచెప్పింది. పాడ్ కాస్ట్‌ను తిరిగి ప్రారంభించుకోవచ్చని.. గువాహటిలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని రణవీర్‌ను ఆదేశించింది. అతి పనికిరాదని, తగ్గించుకుంటే మంచిదని మరో యూట్యూబర్ సమయ్ రైనాను హెచ్చరించింది. కాగా.. ఓటీటీలు, సోషల్ మీడియాలోని కంటెంట్ నియంత్రణకు గైడ్స్ లైన్స్ రూపొందించేటప్పుడు నైతికత విలువలు, భావప్రకటన స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రజల అభిప్రాయాలను పరిశీలించి మార్గదర్శకాలు తయారు చేయాలంది.
నోటీసులు ఇవ్వకుండా కంటెంట్ తొలగించొద్దు..
సోషల్‌మీడియాలో కంటెంట్‌ను తొలగించే ముందు సంబంధిత కంటెంట్ క్రియేటర్ కు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాచారాన్ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. దాన్ని తొలగించేటప్పుడు, ఆ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలని తెలిపింది. కంటెంట్క్రియేటర్వాదనలు వినిపించే అవకాశం లేకుండా సోషల్ మీడియా ఖాతాలు లేదా కంటెంట్‌ను బ్లాక్ చేయడంపై సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
జస్టిస్ బీ ఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదిస్తూ.. నోటీసు లేదా విచారణకు అవకాశం లేకుండా వెబ్‌సైట్‌లు, అప్లికేషన్‌లు, సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వాలు బ్లాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక వాక్ హక్కు, వ్యక్తీకరణ హక్కును కాపాడటానికి సుప్రీంకోర్టు తక్షణ జోక్యం చాలా కీలకమని.. ఇది వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ ప్రజాస్వామ్య నిర్మాణానికి కూడా అవసరమని పేర్కొన్నారు. దీంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నియమాలు 2009లోని రూల్ 16ని రద్దు చేయాలన్న పిటిషన్‌పై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి బెంచ్ నోటీసు జారీ చేసింది.