డబుల్ ఇండ్లలో సౌలతుల్లేవ్ .. ఎలక్షన్​ షెడ్యుల్​ ముందు ఆగమాగంగా లబ్ధిదారుల చేతికి తాళాలు

  • ఇంకా అందని డాక్యుమెంట్లు
  • కనబడని కరెంట్​ కనెక్షన్లు 
  • డ్రైనేజీలు కంప్లీట్ కాక  అవస్థలు 

కామారెడ్డి , వెలుగు: డబుల్​ ఇల్లు వచ్చిందని సంబుర పడాల్సిన లబ్ధిదారులు  ఆ ఇంట్లో సౌలతులు లేకపోవడంతో  ఆందోళన పడుతున్నారు. కామారెడ్డి లో గత ప్రభుత్వ హయాంలో  ఈ ఇండ్లను నిర్మించారు. సుమారు ఐదేండ్ల కిందటనే ఈ నిర్మాణాలు చేపట్టారు. కానీ, లబ్ధిదారులకు ఇవ్వడంలో ఆలస్యం చేశారు.  మొన్నటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కిందటి మార్చిలో ఆగమేఘాల మీద బీఆర్​ఎస్​ లీడర్లు, అధికారులు డ్రాలు తీశారు.

 ఎన్నికల షెడ్యుల్​ విడుదలకు ముందు డబుల్​ ఇండ్ల తాళాలను లబ్ధి దారులకు అందించారు. దీంతో రామేశ్వర్పల్లిలో 202 ఇండ్లకు గాను ప్రస్తుతం 150 వరకు ఫ్యామిలీలు వచ్చాయి. ఇందిరానగర్ కాలనీ వద్ద కూడా 220 ఇండ్లకు గాను ఇక్కడ కూడా సగం మంది నివాసం ఉంటున్నారు. 

పనులేమీ పూర్తి 

ఇందిరానగర్ కాలనీలోని పంపిణీ చేసిన డబుల్​ ఇండ్లలో సౌలత్​లు లేవు. దీంతో లబ్ధి దారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి కనీసం ఇంటి డాక్యుమెంట్​ కూడా ఇవ్వలేదు. కొన్ని కాలనీలలో నీటి సౌకర్యం లేదు. రామేశ్వర్పల్లి దగ్గర నిర్మించిన ఇండ్ల కరంటు లైన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇండ్లకు మీటర్ల కనెక్షన్ ఇవ్వలేదు. చాలా ఇండ్లకు కరెంట్​ కనెక్షన్​ ఇవ్వలేదు.  డ్రెయినేజీ పనులు పూర్తి కాకముందే.. ఇండ్లను కేటాయించారు. 

మున్సిపాల్టీలోనూ అంతే.. 

కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలో 720 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. ఇండ్ల నిర్మాణం పనులు ఐదేండ్ల క్రితమే కంప్లీట్ అయినప్పటికీ , మౌలిక వసతుల పనులకు ఫండ్స్ కొరతతో కేటాయింపులు అపేశారు. ప్రతిపక్షాలు, లబ్ధిదారుల ఆందోళనలతో ఏడాది క్రితం మౌలిక వసతులకు ఫండ్స్ కేటాయించి పనులుచేపట్టినప్పటికీ కంప్లీట్ కాలేదు. మున్సిపాల్టీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ, దేవునిపల్లి, టెక్రియాల్, ఇల్చిపూర్, రామేశ్వర్పల్లిలో    అప్లికేషన్లు స్వీకరించారు. 5,047 అప్లీకేషన్లు వస్తే క్షేత్ర స్థాయిలో ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి 3,450 మందిని అర్హులుగా గుర్తించారు. ఇండ్లు తక్కువగా ఉండటం అర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను సెలక్ట్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు.

పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలి

 రామేశ్వర్పల్లి శివారులో తమకు ఇండ్లు  ఇచ్చారు  కానీ ఇంకా పట్టా సర్టిఫికేట్ ఇవ్వలేదు.  ఈ సర్టిఫికేట్ లేకపోవటంతో తాము  కరంటు మీటర్​కు  అప్లయ్ చేసుకొలేదు.  కరెంట్​ కోసం ఇబ్బంది పడుతున్నాం.

రాజేశ్, లబ్ధిదారుడు

మొన్నటి వరకు  ట్యాంకర్లతో నీళ్లు కొన్నాం

మొన్నటి వరకు ట్యాంకర్లతో నీళ్లు కొన్నాం.  రామేశ్వర్పల్లిలో  వారం కిందటే పైపులైన్ కనెక్షన్ ఇవ్వటంతో ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి.  నల్లాల ద్వారా పైకి నీళ్లు ఎక్కించేటప్పుడు లీకేజీ అవుతున్నాయి.  కరంటు కనెక్షన్ కోసం పట్టా సర్టిఫికేట్లు అడుగుతున్రు. తొందరగా సర్టిఫికేట్లు ఇయ్యాలి.

నర్సవ్వ, లబ్ధిదారు