తస్మాత్ జాగ్రత్త: వీటి కోసం గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు

తస్మాత్ జాగ్రత్త: వీటి కోసం గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు

ఏ చిన్న సమాచారం అవసరమైనా.. చాలా మంది వెంటనే చేసే పని గూగుల్‌లో సెర్చ్ చేయడమే. అయితే ప్రతిసారీ కరెస్ట్ ఇన్‌ఫర్మేషన్ వస్తుందని నమ్మలేం. ఎందుకంటే గూగుల్ సొంతగా నిర్ధారణ చేసుకుని పెట్టే డేటా చాలా తక్కువ. ఏదైనా సమాచారం కోసం మనం సెర్చ్ చేసినప్పుడు రకరకాల వెబ్‌సైట్ లింకులు కనిపిస్తాయి. వాటిలో ఏది అసలు, ఏది నకిలీ అని గుర్తించడం కూడా కష్టమే. పొరబాటున ఫేక్ సైట్‌ను ఓపెన్ చేస్తే లేనిపోని కష్టాలను మనమే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సో కొన్ని రకాల అంశాలను గూగుల్‌లో సెర్చ్ చేయకపోవడమే మంచిది. మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు వహించాలి. గూగుల్‌లో సెర్చ్ చేయకూడని కీలకమైన కొన్ని అంశాలను ఒకసారి చూద్దాం.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లు

తెలిసీ తెలియకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లను గూగుల్‌లో సెర్చ్ చేయకపోవడం చాలా మంచిది. కచ్చితంగా బ్యాంకు అఫీషియల్ యూఆర్ఎల్ తెలుసుకుని మనీ ట్రాన్సాక్షన్లు చేసుకోవడం మేలు. తెలియక ఏవో ఫేక్ సైట్లను క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బు అంతా పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు. బ్యాంకు డీటైల్స్ తెలుసుకుని మీ సొమ్మంతా దోచేసేందుకు హాకర్లు రెడీగా ఉంటారని గుర్తించాలి.

కస్టమర్ కేర్ నంబర్లు

బ్యాంకు లావాదేవీల మొదలు ఆన్‌లైన్ ఆర్డర్ల వరకూ.. ఏదైనా సమస్య వస్తే కస్టమర్ కేర్‌కి కాల్ చేయడం మామూలే. కానీ ఆ నంబర్లు తెలియని వాళ్లు గూగుల్‌లో వెతుకుతుంటారు. ఇలాంటి వారిని టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేందుకు ఫేక్ నంబర్లను పెడుతుంటారు సైబర్ నేరగాళ్లు. ఈ మోసగాళ్లకు దొరక్కుండా చూసుకునేందుకు బ్యాంకు లేదా ఆయా కంపెనీల అఫీషియల్ వెబ్‌సైట్‌లోని నంబర్లు మాత్రమే తీసుకుంటే మంచిది.

యాప్‌‌‌‌లు

మొబైల్ ఫోన్ యాప్స్ కోసం గూగుల్ సెర్చ్‌లో వెతకడం చాలా డేంజర్. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ లాంటి వాటిలోనే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం బెటర్. అది కూడా మీరు వెతుకుతున్న అసలు యాప్ అని తెలుసుకున్నాకనే ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదంటే ఫేక్ యాప్‌లు ఫోన్‌లోకి వచ్చాయంటే మన డేటా మొత్తం చోరీ చేసే చాన్స్ ఉంది. మన పర్సనల్, బ్యాంకింగ్ సహా ఇన్‌ఫర్మేన్ అంతా హాకర్ల చేతిలి వెళ్లే ప్రమాదం ఉంది.

మందులు

అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్‌ని కలిసి వారి సలహాతో మందులు వాడుకోవడం మంచిది. ఈ మధ్య యువత ఏ మాత్రం హెల్త్ ప్రాబ్లం వచ్చినా రోగ లక్షణాలను గూగుల్‌లో సెర్చ్ చేసి మందులు వాడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. పొరబాటున తప్పు మందులు వాడితే అసలుకే మోసం వచ్చే చాన్స్ ఉంది.

డైట్ ప్లాన్

బరువు తగ్గాలనుకునే వాళ్లు, పెరగాలని ఆశ పడేవాళ్లు డైట్ ప్లాన్ కోసం గూగుల్‌పై ఆధారపడుతుంటారు. అందులో వచ్చిన ఏదో ఒక సమాచారాన్ని నమ్మేసి పాటిస్తుంటారు కూడా. కానీ, ఒక్కో మనిషి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకుని మంచి డైట్ ఫాలో అవ్వడం మేలు.

షేర్ మార్కెట్ సలహాలు

ఉద్యోగాలు చేసే వాళ్లు, డబ్బును షేర్లలో పెట్టాలనుకునేవాళ్లు అనాలసిస్ కోసం గూగుల్‌లో వెతుకుతుంటారు. ఏ స్టాక్స్‌లో పెట్టాలి? ఎంత మొత్తం పెడితే మంచిది? అన్న విషయాలపై ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మేలు. గుడ్డిగా గూగుల్‌ని నమ్మి ఇన్వెస్ట్‌మెంట్లు పెడితే అసలుకే మోసం రావచ్చు.

గవర్నమెంట్ వెబ్‌‌‌‌సైట్లు

గవర్నమెంట్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లనూ నెట్‌‌‌‌లో సెర్చ్‌‌‌‌ చేయకపోవడమే మంచిది. మున్సిపాలిటీ ట్యాక్స్‌ లాంటివి కట్టించుకుంటామంటూ ఫేక్ వెబ్ సైట్ లింకులు చాలానే గూగుల్‌లో ఉంటాయి. నేరుగా ప్రభుత్వ వెబ్ సైట్ యూఆర్ఎల్ తెలుసుకుని పనులు పూర్తి చేసుకోవడం మేలు. లేదంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.

సోషల్‌‌‌‌ మీడియా వెబ్‌‌‌‌సైట్లు

యూఆర్‌‌‌‌ఎల్‌‌‌‌ టైప్‌‌‌‌ చేసే మీ సోషల్‌‌‌‌ మీడియా వెబ్‌‌‌‌సైట్లకు లాగిన్‌‌‌‌ అవండి. లాగిన్‌‌‌‌ పేజ్‌‌‌‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌‌‌‌ చేస్తే సేమ్ అసలు దాని లాంటి నకిలీ వెబ్‌‌‌‌సైట్లు వచ్చే చాన్స్‌‌‌‌ ఉంటుంది. మోసగాళ్లు మన డేటా మొత్తం లాగేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడే ప్రమాదం ఉంది.

ఈ కామర్స్‌‌‌‌ సైట్లు

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లు నేరుగా కంపెనీ అఫీషియల్ సైట్లు, లేదా వెబ్‌సైట్లనే వాడడం మేలు. ఆఫర్లు ఉన్నాయంటూ గూగుల్‌లో కనిపించిన సైట్లను క్లిక్ చేస్తే నిండి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. డమ్మీ సైట్లలో పొరబాటున లాగిన్ అయ్యారంటే మన డేటా, డబ్బులు.. రెండూ నష్టపోయే చాన్స్ ఉంది.

యాంటీ వైరస్‌‌‌‌‌‌

యాంటీ వైరస్‌, సాఫ్ట్‌‌‌‌వేర్ల కోసం గూగుల్‌లో వెతికేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. నకిలీలను డౌన్‌లోడ్ చేసుకుంటే మాల్‌వేర్‌ను మనమే ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఈ విషయంలో జన్యూన్ సైట్లను గురించి తెలుసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.

పోర్న్‌‌‌‌

గూగుల్‌లో పోర్న్ కోసం సెర్చ్ చేస్తే మీ గ్యాడ్జెట్ మాల్ వేర్ బారినపడొచ్చు. మాల్‌వేర్‌కు పోర్న్ సైట్లు హైవే లాంటవి. అలాగే తరచూ పోర్న్ చూస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే చాన్స్ ఉంది. గూగుల్ యాడ్స్ కూడా మనం ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తుంటామనే దానిని బట్టి కనిపింస్తుంటాయి. తర్వాత ఎప్పుడైనా పోర్న్ సంబంధించిన యాడ్స్ పాపప్ వస్తే తోటి వారి ముందు నవ్వులపాలు కావాల్సి వస్తుంది.