రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) లోనే హైదరాబాద్ వినాయకులను నిమజ్జనం చేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో రేపటి గణేశ్ నిమజ్జన సందర్భంగా వీడ్కోలు వేదిక ఏర్పాట్లను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై. సీఎం కేసీఆర్ పై పలు కామెంట్లు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ... నిన్న ఓ మంత్రి సినిమా యాక్టర్ లాగా డ్రామాలాడుతున్నాడని, బీజేపీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి చేసిన పోరాటం వల్లే అదరాబాదరగా అక్కడ జేసీబీలు తెచ్చిపెట్టారని చెప్పారు.
హిందూ సమాజం ఐక్యతను చాటే వినాయక చవితి వేడుకలను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువులంతా బిచ్చమెత్తుకునే పరిస్థితి ఏర్పడిందన్న ఆయన... నిమజ్జన ఏర్పాటు చేయాలని బ్రతిమాలేలా ఈ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. నీవు నిఖార్సయిన హిందువు అయితే ఇంత పెద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై ఎందుకు సమీక్ష చేయడం లేదని ఆయన సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తాను కరీంనగర్ లో జరిగే వినాయక నిమజ్జన వేడుకల్లోనే పాల్గొంటానని.. కరీంనగర్ లోని వినాయక మూర్తులంతా క్లాక్ టవర్ లో వీడుకోలు తీసుకొని నిమజ్జనానికి తరలి వెళ్లాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.