
- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో
- గ్రామ పంచాయతీల ఎదుట నిరసన
- విచారణకు ఆదేశించిన ఎంపీడీవో
భీమదేవరపల్లి, వెలుగు : గాంధీ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వివిధ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో గృహలక్ష్మి మొదటి లిస్టు ప్రకటించగా, అనర్హులను ఎంపిక చేశారంటూ ఆశావాహులు నిరసన వ్యక్తం చేసి ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. మండల వ్యాప్తంగా 2,700 మంది దరఖాస్తు చేసుకోగా 2,300 మందిని ప్రాథమికంగా గుర్తించారు. సోమవారం మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సుమారు 600 మందిని ఎంపిక చేసినట్టు లిస్టు ప్రకటించారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో170 లబ్ధిదారుల్లో 19 మంది, గాంధీనగర్ లో130 లబ్ధిదారులకు 17 మంది పేర్లను ప్రకటించారు.
దీంతో భీమదేవరపల్లితో పాటు గాంధీనగర్గ్రామ పంచాయతీ ఆఫీసుల ఎదుట ఆశావాహులు అనర్హులను ఎంపిక చేశారంటూ ఆందోళన చేశారు. అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఇల్లు ఉన్న వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, దరఖాస్తులో రేషన్‌కార్డు లేకుంటే అప్లికేషన్రిజెక్ట్చేసిన అధికారులు కొంత మంది నాయకులకు మాత్రం ఆ నిబంధన వర్తింపజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పంచాయతీ పాలకవర్గం మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదని, అధికారులే ఎంపిక చేశారని చెప్పినా వినలేదు. ఖాళీ స్థలం ఉండి, గుడిసెల్లో ఉంటున్నామని, అయినా తమకు ఇవ్వలేదని కొందరు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం ఎంపీడీవో వరకు చేరడంతో ఎంక్వైరీ చేయాల్సిందిగా పంచాయతీ సెక్రెటరీలను ఆదేశించినట్లు సమాచారం.