బీసీల రాజ్యాధికారం కోసం కలిసి పోరాడుదాం

బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తీసిన లెక్కల ప్రకారం మనదేశంలో 52% బీసీల జనాభా ఉన్నట్టు తేలింది. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా దేశంలో సగానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలపై ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక పై ఇది సాగదు. బీసీ సామాజిక వర్గాలు నిజాన్ని తెలుసుకున్నాయి. దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే దిశగా ప్రయాణానికి సిద్ధమయ్యాయి. ఆధిపత్య సామాజిక వర్గాల కారణంగా దగాపడ్డ బడుగు, బలహీన బీసీ సమాజం తమ బతుకులు బాగుచేసుకోవాలని నిర్ణయించుకుంది. బీసీల రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా పోరాటం చేసేందుకు రెడీ అయ్యింది.ఇటీవల కాలంలో బీసీలు రకరకాల పేర్లతో సంఘాలు, ట్రస్ట్​లు ఏర్పాటు చేసుకుని వారివారి స్థాయిలో కులాల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ‘బీసీల సమగ్రాభివృద్ధి’ అనే లక్ష్య సాధన కోసం ప్రజాస్వామ్య బద్ధంగా గొప్ప సమాజంగా ఎదగాలంటే ఏం చేయవలసి ఉంది? అనేది ఆలోచించాలి. బీసీలు సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో బీసీ సంఘాల విధివిధానాలకు, పద్ధతులకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. బీసీ సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ బద్ధమైన పద్ధతులకు అవకాశం ఉన్నప్పుడు అదే మార్గంలో ప్రయత్నం కొనసాగించాలి. బీసీల గౌరవాన్ని, సభ్యుల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను ఎంత గొప్పవారైనా గానీ వారి పాదాల దగ్గర పెట్టకూడదు. అప్పుడే బీసీల ఆత్మగౌరవం నిలబడుతుంది.

సంఘాల పతనానికి దారి తీసే అంశాలు..

ఎంత గొప్పవారైనా సరే, వారిని నమ్మి బీసీల ఆశయాలతో నిండి ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలను, అధికారాన్ని మనం గొప్ప వారనుకునే వారి చేతుల్లో పెట్టకూడదు. ‘‘ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరు’’ అనే సూత్రం మాదిరిగా ఉండాలి. బీసీల కోసం జీవితాంతం సేవలు అందించిన మహానుభావులు ఎవరైనా ఉన్నా లేదా దేశంలో ‘‘బీసీకార్డ్’’ పేరుతో అందివచ్చిన అవకాశం ద్వారా గొప్ప వారుగా ఎదిగి ధనవంతులుగానో, నాయకులుగానో  తయారైన వారి పట్ల బీసీ సంఘాలు, సంస్థల తరపున కృతజ్ఞత, గౌరవం చూపడం తప్పేమీ కాదు. కానీ, సదరు కృతజ్ఞత చూపడానికీ, గౌరవం ఇవ్వడానికీ  కూడా కొన్ని పరిమితులు నిర్ణయించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే, బీసీల్లో మితిమీరిన స్వామిభక్తి, వ్యక్తి పూజ, ధనవంతుల భజన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఉద్దేశించిన బీసీ కులాలను చైతన్యపరిచే విషయంలో విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడం అనే మహత్తర కార్యాన్ని సాధించడంలో ఈ వ్యక్తి పూజలు, స్వామి భక్తి  వంటివి సంఘాల పతనానికి దారి తీస్తాయి. అప్పుడు కొందరి కేంద్రీకృత నియంతృత్వానికి లోబడి పని చేయాల్సి వస్తుంది.

స్వేచ్ఛా, సమానత్వాలు వికసించాలంటే..

సంఘాలు, సంస్థల ద్వారా బీసీలను సామాజికంగా ఆధిపత్య వర్గాల మాదిరిగా సామాజికంగా చైతన్యం అయ్యేలా కృషి చెయ్యాలి. బీసీలందరికీ సామాజిక ప్రజాస్వామ్యపు ఫలాలు అందేలా కృషి చెయ్యాలంటే సామాజిక ప్రజాస్వామ్యం గురించి ముందు తెలుసుకోవాలి. అలా మసలుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం జీవన సూత్రాలుగా గుర్తించే జీవన విధానాన్నే సామాజిక ప్రజాస్వామ్యం అంటారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి వేర్వేరు అని భావించరాదు. ఇవి మూడు కలిసి ఉండే ఒకే ఐక్యసూత్రం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాటిలో ఒకదాని నుంచి మరొకదాన్ని వేరు చేస్తే అసలు బీసీ సంఘాలు, సంస్థల ప్రజాస్వామ్య ప్రయోజనమే దెబ్బతింటుంది. స్వేచ్ఛను సమానత్వం నుంచి వేరు చేయడానికి వీలులేదు. సమానత్వాన్ని స్వేచ్ఛ నుంచి వేరు చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ సౌభ్రాతృత్వం నుంచి వేరు చేయలేం. సమానత్వం లేకుండా స్వేచ్ఛ మాత్రమే ఉంటే అది అనేకుల మీద కొందరి ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది. స్వేచ్ఛ లేకుండా సమానత్వం మాత్రమే ఉంటే అది వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సౌభ్రాతృత్వం లేకుండా స్వేచ్ఛ, సమానత్వాలు సహజంగా వికసించలేవు. వాటిని అమలు చేయడానికి సౌభ్రాతృత్వం అనేది రక్షక భటునిగా ఉండాలి.

కులాధిక్య భావాలు ఉంటే..

మన సమాజంలో ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం మూడింటిలో రెండు ఎంతమాత్రం లేవనే గుర్తింపుతో బీసీ సంఘాల నాయకత్వాలు పని ప్రారంభించాలి. ఆ రెండింటిలో ఒకటి సమానత్వం. ఇండియాలో తారతమ్యం, అసమానత అనే సూత్రం పునాదిగా ఉంది. అంటే ఈ సమాజంలో కొందరికి అపార సంపద, అసంఖ్యాకులు దుర్భర దారిద్ర్యంలో జీవించే స్థితి ఉంది. రాజ్యాంగంలోనేమో అందరికీ సమానత్వం ఉంటుంది. సామాజిక ఆర్థిక జీవనంలో మాత్రం అందరికీ అసమానత్వం ఉంటుంది. రాజ్యాంగంలో అందరూ మనుషులే. అందరికీ ఒకే ఓటు.. ఓకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. కానీ సమాజంలో అలా లేదు. ఇది అందరికీ తెలిసిన నిజమే. కానీ బీసీల సామాజిక, ఆర్థిక జీవనంలో కూడా బీసీల వ్యవస్థ ‘ఒక మనిషికి ఒకే విలువ’ అనే సూత్రాన్ని నిరాకరించడం చూస్తాం. మన సామాజిక, ఆర్థిక జీవనంలో మనకు ఇతరులు.. మనకన్నా కింద వాళ్లకీ సమానత్వాన్ని నిరాకరిస్తున్నాం. ఎంతకాలం ఇలా కొనసాగగలం? ఇది దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా మనం చూడవచ్చు. కనుక ఈ సంఘర్షణ నుంచి బీసీలను బయటికి తీసుకురావాలి. ఇది చాలా ముఖ్యమైన పనిగా తీసుకుని ఆ దిశగా కృషి చెయ్యాలి. మరో ముఖ్య విషయం ఏమంటే.. బీసీ కులాల్లో ఎవరికైనా కులాధిక్య భావనలు.. అంటే కింది కులాల వారికంటే గొప్ప అనే భావన కలిగి ఉండటం. కులం/రంగు కారణంతో నీచమైన భావన కలిగి/ వివక్షా పూరితంగా ప్రవర్తించే అలవాట్లు కలిగిన వారు ఉంటే అటువంటి వారిని సరిదిద్ది మానవత్వంతో నడుచుకునేలా మార్చుకోవాలి.

ఒకే మార్గంలో నడవాలి..

ప్రస్తుతం దేశమంతటా బీసీలను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీలు, పదవులు, పథకాలు అంటూ పలు రకాల ఆశలతో మోసం చేస్తూ బీసీలను విడదీసి పాలించాలనుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు, సంఘాలు, పార్టీల్లో సభ్యత్వం కలిగి ఉన్నా అటువంటి వారి అభిప్రాయాలను మోసే వారిని బీసీ సంఘాలు, సంస్థల్లో కంట్రోల్‌‌ చేస్తే బాగుంటుంది. మనం స్వచ్ఛంగా మహాత్మా జ్యోతిబా పూలే, బీపీ మండల్  దారిలో నడవాలి. చివరగా.. మరో ముఖ్య అంశం.. ‘సౌభ్రాతృత్వ భావనను’ గుర్తించకపోవడం. మన సామాజిక జీవనానికి ఐక్యతను, సంఘీభావాన్ని ఇచ్చే సూత్రమే సౌభ్రాతృత్వం. ఇది చాలా కష్టసాధ్యమైన సూత్రం. ఈ సౌభ్రాతృత్వాన్ని సాధించడం చాలా కష్టం. ఎన్నో ఉప కులాలతో విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్న బీసీల్లోని భిన్నమైన కులాల వారందరం సోదరులం. వీరంతా ఒకే మార్గంలో నడవాలనేది కొంచెం శ్రమతో కూడిన పనే. బీసీల ముందు ఉన్న కర్తవ్యాల గురించి రకరకాల ఆలోచనలు చేద్దామా? నమ్మకంతో ముందుకు నడుద్దామా? ఇంకా అవే ఆలోచనలు చేద్దామా? ఇలానే వేచి చూద్దామా? అనే సంకోచం వద్దు. ధైర్యం, ఐక్యత, ఆలోచనతో బీసీ సంఘాల నాయకత్వం ముందుకు సాగాలి. బీసీల్లోని భిన్నమైన కులాల ఐక్యతను చాటాలి. చట్టబద్ధమైన రాజ్యాధికారాన్ని సాధించి భవిష్యత్‌‌ భారత రాజ్యాధికారం మాదేనని గర్వంగా చెప్పుకునే స్థాయికి బీసీ సంఘాల నాయకత్వం ఎదగాలని ఆశిద్దాం.

- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్​