మన రైతుల గురించి ఫారినోళ్లకు ఏం తెలుసు?

మన రైతుల గురించి ఫారినోళ్లకు ఏం తెలుసు?

 

ఇన్​స్టంట్​ పబ్లిసిటీ సిండ్రోమ్ వెర్రితలలు వేస్తోందనడానికి గత రెండు మూడు రోజులుగా రిహానా, గ్రెటా తదితర ఫారినర్లు చేస్తున్న ట్వీట్లు ఒక నిదర్శనం. పబ్లిసిటీ కోసం తలాతోకా లేకుండా అసంబద్ధంగా ట్వీట్లు చేయడం, ప్రకటనలు ఇవ్వడం ఒక ఫ్యాషన్​ అయిపోయింది. ఐడెంటిటీ కోల్పోయి గుడ్డి ఎద్దుల్లాగ పరిగెడుతున్న కాంగ్రెస్, లెఫ్ట్​ నాయకులకు, ఉదారవాదులకు, ఇండియా వ్యతిరేక శక్తులకు ఈ ట్వీట్లు కొద్దిగా ప్రాణ వాయువును అందిస్తూ తాత్కాలిక ఉపశమనానికి పనికి వస్తున్నాయి. వీలైనంత త్వరగా దేశాన్ని ఐదు ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా మార్చడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మన దేశం గురించి, ఇక్కడి రైతులకు దళారీ వ్యవస్థ వల్ల ఎదురవుతున్న సమస్యల గురించి ఏమీ అవగాహన లేని ఫారినర్లు చేస్తున్న ట్వీట్లను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీల నాయకులు, ఉదారవాదులు కేంద్రానికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నది. దేశం ఆర్థికంగా బలపడాలంటే వ్యవసాయ రంగం మరింత బలపడాల్సి ఉంటుంది. రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి. రైతుల ఆదాయం పెరగాలి. దళారుల ఇనుప పంజరాల నుంచి బయటపడి స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చిన ధరకు రైతు పండించిన పంటను అమ్ముకునే అవకాశం ఉండాలి. ఇందుకు చట్టపరమైన రక్షణ ఉండాలి. అప్పుడే రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సెప్టెంబర్​లో మూడు కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే చట్టాలు ఇవి. రైతులు తమ పంటలను తామే, తమకు నచ్చిన ధరలకు, తమకు నచ్చినచోట అమ్ముకునే వీలు కల్పించడం, వ్యవసాయ రంగంలో అనవసరమైన ఖర్చులను తగ్గించడం, ఉత్పత్తులు వృథాగా పోకుండా ఆపడం, ధరల స్థిరీకరణ, మార్కెట్​ యార్డుల అజమాయిషీ నుంచి, దళారుల కబంధ హస్తాల నుంచి రైతులకు రక్షణ కల్పించడం, అధిక ఉత్పత్తుల కోసం పంట వేయడానికి ముందే వ్యవసాయానికి కావాల్సిన మూలధనాన్ని పొందడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడం కేంద్రం తెచ్చిన ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం.

సన్నకారు రైతులకు మేలు చేసే చట్టాలు

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడికైనా(ఇతర రాష్ట్రాలతోపాటు) తరలించుకోవడానికి, మార్కెట్​ యార్డులతో ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి పూర్తి వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం దేశంలోని 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసే చట్టాలు ఇవి. వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పనకు కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఉత్పత్తులు పెరుగుతాయి. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలలో పెట్టుబడులు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో నిరంతర ప్రగతి సాధ్యమవుతుంది. రైతు బలపడితే దేశం బలపడుతుంది. దేశం బలపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రపంచంలో ఇండియా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దేశ వికాసానికి మార్గం సుగమం అవుతుంది.

రిపబ్లిక్‌ డే నాడు ఢిల్లీలో విధ్వంసం

మార్కెట్​ యార్డుల్లో పీఠం వేసుకుని కూర్చుని రైతులను పీడించి ఇన్నాళ్లూ డబ్బులు కూడబెట్టుకున్న దళారులకు ఈ చట్టాలు నచ్చలేదు. తమ పునాదులు కదులుతున్నాయన్న భయం వేసింది. దీంతో కొంత మందిని రెచ్చగొట్టి ఆందోళనలను ప్రారంభింప చేశారు. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతానికి చెందిన  రైతులు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. పంజాబ్ సీఎం అమరీందర్​సింగ్ (కాంగ్రెస్ పార్టీ)​ దీనికి వత్తాసు పలికారు. బీజేపీ వ్యతిరేకులు, మోడీ విమర్శకులు దీన్ని ఒక సాకుగా చేసుకుని ఆందోళనలను సమర్థించడం మొదలుపెట్టారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమం కేవలం పంజాబ్, హర్యానా​ రైతులకే పరిమితం కావడం వెనుక ఆంతర్యం లేదా కుట్ర ఇట్టే అర్థమవుతుంది. ఢిల్లీ ముట్టడి, ట్రాక్టర్ల ర్యాలీ పేరిట రిపబ్లిక్​డే రోజు జరిగిన విధ్వంసం, దేశ వ్యతిరేక చర్యలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ట్రాక్టర్ల ర్యాలీని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన దారిలో కాకుండా ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించి ఎర్రకోట చేరుకుని జాతీయజెండా ఎగురవేసే స్థలం వద్ద ఇతర జెండాలను ఎగురవేసి దేశ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా మన సార్వభౌమత్వాన్ని సవాల్​ చేశారు. ట్రాక్టర్లతో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. వందలాది మంది పొలీసులను గాయపరిచారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాలని వీరు వేసుకున్న కుట్రలను పోలీసులు సంయమనంతో వ్యవహరించి భగ్నం చేశారు.

కెనడా ప్రధాని కామెంట్స్​తో మొదలు

రైతు ఉద్యమం పేరిట దళారీలు ఢిల్లీలో విధ్వంసం సృష్టించే కుట్రలకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప, చట్టంలోని మంచి చెడులపై చర్చించడం, సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడంపై ఉత్సాహం చూపడం లేదు. ఎంత ప్రయత్నించినా ఉద్యమం ప్రజామోదం పొందలేదు. దీంతో నిరుత్సాహపడిన ఇండియా వ్యతిరేక శక్తులు మొదట్లో ఖలిస్థాన్ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రంగా ఉండే కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోను రంగంలోకి దించారు. భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, దీని పూర్వాపరాలు తెలియనప్పటికీ, దౌత్య సంబంధాల సంస్కారాన్ని మర్చిపోయి.. వేరే దేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న ఇంగితం వదిలేసి ఆయన ఈ రైతు ఉద్యమానికి మద్దతుగా కామెంట్స్ చేశారు. బహుశా కెనడాలో బలంగా ఉండే ఖలిస్థాన్ ఉద్యమకారుల ఒత్తిడికి లొంగిపోయి ట్రూడో ఈ పని చేసి ఉంటారని అందరూ భావించారు. ‘మా దేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని ఢిల్లీలోని కెనడా రాయబారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక పంపింది. కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.  ఇటువంటి అనవసర జోక్యాన్ని తేలిగ్గా తీసుకోబోమని హెచ్చరించడంతో కెనడా సర్కారు వెనుకడుగేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేరిట చేసిన ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో రైతు ఉద్యమం పేరిట దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారికి ఆశలు అడియాసలయ్యాయి.

భారత రైతు గురించి తెలియని ఫారినర్ల ట్వీట్లు

పొలం, దుక్కి, సేద్యం, విత్తనం, నారుమడి అంటే కూడా తెలియని వాళ్లు, నారుకు, నాటుకు తేడా తెలియని వాళ్లు కూడా తలపాగాలు చుట్టుకుని రైతు ఉద్యమంలో నిలబడి ఫొటోలకు ఫొజులిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదే అదనుగా కొన్ని అరాచక శక్తులు రైతు ముసుగులు వేసుకుని ఉద్యమంలో దూరిపోయాయి. అయితే ఈ పోరాటానికి దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజల మద్దతు లభించలేదు. దీంతో ఇక పని కాదనుకున్న ఉద్యమకారులు విదేశీ శక్తులను ప్రేరేపించి రైతుల ఉద్యమానికి మద్దతు అంటూ కొత్తగా ట్వీట్ల డ్రామాకు తెరలేపారు. వెస్ట్రన్ పాప్ సింగర్ రిహానా,  స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్‌, అమెరికాకు చెందిన మోడల్, ఒకప్పటి పోర్న్‌ స్టార్ మియా ఖలీఫా లాంటి వాళ్లు రైతుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇండియా, ఇక్కడి ప్రజల జీవన విధానం, రైతుల సమస్యల గురించి వీరికి ఏ మాత్రం అవగాహన లేదు. ఎవరితో ఏ రకమైన రహస్య ఒప్పందం జరిగిందో ఏమో గానీ, రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు. భారత రైతుల గురించి, దళారీ వ్యవస్థ వల్ల వాళ్లు పడుతున్న కష్టాల గురించి ఏమైనా తెలిస్తే వాళ్లు ఈ పని చేయరు. దేశ విదేశాల్లో లక్షలాది ఫాలోవర్లు ఉన్న వీరితో ట్వీట్లు చేయించడం ద్వారా భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా బురదజల్లే ఉద్దేశం తప్ప మరో ఆలోచన కనిపించడం లేదు.

ఆ ట్వీట్లతో రాజకీయం

సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోయర్స్‌ ఉన్న వారిని ‘ఇన్‌ఫ్లూయన్సర్స్‌’ అంటారు. ఇలాంటి వాళ్లు డబ్బులు తీసుకుని పోస్టులు చేస్తుంటారు. ఇప్పుడు బొత్తిగా సమస్య గురించి అసలు అవగాహన లేకుండా కేంద్రానికి వ్యతిరేకంగా విదేశీయులు చేస్తున్న ట్వీట్లు కూడా అలా డబ్బుకు అమ్ముడుపోయినవేనని సోషల్ మీడియా మార్కెటింగ్‌ గురించి తెలిసిన ఎవరికైనా  క్లియర్‌‌గా అర్థమవుతుంది. దేశ వ్యతిరేక, మోడీ వ్యతిరేక శక్తులు ఈ పని చేయించి, ప్రపంచ వ్యాప్తంగా రైతు ఉద్యమానికి మద్దతు అని ప్రచారానికి వాడుకుంటున్నారని అనుమానం కలుగుతోంది. ఈ ట్వీట్లను భుజానికెత్తుకుని ప్రతిపక్షాలు, నేతలు చేస్తున్న  హంగామా చూస్తే తమ రాజకీయ స్వార్థం కోసం దేనికీ వెనుకాడట్లేదని అనిపిస్తోంది. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం.

రైతు ప్రయోజనాలు వదిలేసి.. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్

ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం 11 దఫాలుగా చర్చలు జరిపింది. రైతుల డిమాండ్లకు అనుగుణంగా అనేక మార్పులు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మూడు చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలిపేసేందుకు కూడా రెడీ అని హామీ కూడా ఇచ్చింది. రైతు ప్రయోజనాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం సూచించిన మార్పుల్లో మంచి చెడులను పరిశీలించకుండానే చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఉద్యమ నాయకత్వం మొండిపట్టు పట్టింది. దీంతో ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్న వారికి అసలు రైతుల సమస్యల పరిష్కారం అనేది ఇంపార్టెంట్‌ విషయమే కాదని, రైతుల పేరు చెప్పి ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకోవడమే ముఖ్యమని, ఢిల్లీలో జరుగుతున్న పోరు మన దేశ రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారిందని  పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

– కామర్సు

బాలసుబ్రహ్మణ్యం,

బీజేపీ పార్లమెంటరీ ఆఫీస్ సెక్రటరీ