గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని ఓపెన్‌కాస్ట్ 5 ప్రాజెక్ట్‌లో మట్టి (ఓవర్ బర్డెన్) వెలికితీత పనులు చేపట్టే పీసీ పటేల్ కాంట్రాక్టు కంపెనీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 13 రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్‌తో స్థానిక కాంగ్రెస్ లీడర్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
ఇప్పటికే పీసీ పటేల్ కాంట్రాక్టు కంపెనీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన కాంట్రాక్టు కార్మికులను వారి స్వస్థలాలకు పంపించారు. స్థానిక నిరుద్యోగులకు ఓబీ కంపెనీలో 80 శాతం ఉద్యోగాలను దశల వారీగా ఇవ్వడానికి ఆఫీసర్లు అంగీకరించారు. చర్చల్లో లీడర్లు బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, బాలరాజు, కె.సదానందం, సతీశ్, రమేశ్ పాల్గొన్నారు.