హైదరాబాద్: ఉప్పల్ లోని చిలకానగర్ లో ఓ ఇంటి ఓనర్ పై అపరిచితులు దాడి చేశారు. ఇంటి అద్దెకోసం వచ్చిన యూపీ కి చెందిన ఓ యువతి, యువకుడు ఇంట్లో చొరబడి వృద్ధుడైన ఓనర్ పై దాడి చేసి గాయపర్చారు. అతడి ముఖంపై స్ప్రేకొట్టేందుకు ప్రయత్నించారు. ఓనర్ గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్ లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన పిట్టల సుదర్శన్ (66) బిల్డింగ్ లో టూలెట్ బోర్డు చూసి ఇంట్లోకి వెళ్లిన యూపికి చెందిన హిమాన్షి(23), గాంధీ(21) లు సుదర్శన్ పై దాడి చేశారు. హిమాన్షి, గాంధీలు స్థానికంగా ఉన్న కంపెనీల్లో పనిచేస్తున్నారు. టూలెట్ బోర్డు ఉండటంతో ఇళ్లు అద్దెకు కావాలని సుదర్శన్ ను అడిగారు. అయితే స్థానికులు కాకపోవడంతో అద్దెకు ఇచ్చేందుకు ఓనర్ నిరాకరించాడు.
పై అంతస్తులో రూం లకు తాళం వేసేందుకు సుదర్శన్ వెళ్లగా.. హిమాన్షి, గాంధీలు కూడా వెళ్లి సుదర్శన్ పై దాడి చేశారు. ముఖంపై స్ర్పే కొట్టే సమయంలో అతడు గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి హిమాన్షి, గాంధీలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ఇంటి ఓనర్ పిట్టల సదుర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దె కోసం వచ్చి దాడి జరగడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది..స్థానికులు ఆందోళన చెందుతున్నారు.