పల్లెటూరోళ్లు పట్నంలో ఓటేసిన్రు

ఆదిలాబాద్,​ వెలుగు: పల్లెటూరోళ్లు పట్నం వచ్చి ఓటేయడం.. ఒకరి ఓటు మరొకరు వేయడం.. డబ్బులిస్తేనే ఓటేస్తామని పట్టుపట్టడం.. ఇవన్నీ బుధవారం జరిగిన మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​లో ఆదిలాబాద్ ​ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దర్శనమిచ్చాయి. కేవలం మున్సిపాలిటీ ఎన్నికల కోసమే పల్లెటూరోళ్ల ఓట్లను పట్నాలకు మళ్లించి వేయించుకున్నారంటూ పలు పార్టీల నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్​ ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ఇదే సమస్య కనిపించింది. కొన్నిచోట్ల ఒకరి ఓట్లు మరొకరు వేస్తే, మరికొన్నిచోట్ల పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ ఓటేయడం చర్చనీయాంశమైంది. ఓటు నమోదు సమయంలోనే కొందరు కౌన్సిలర్లు పల్లెటూర్లలోని కొందరి ఆధార్​కార్డులు, ఇతర పత్రాలు తెప్పించుకుని వారి ఓట్లను పట్నాల్లో నమోదు చేయించారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆదిలాబాద్​ పట్టణంలోని 45వ వార్డులో ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఇదే పంథాను అనుసరించినట్లు బీజేపీ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్​ పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం జరిగిన పోలింగ్​లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలైన జమ్దాపూర్, గోట్కూర్, తాంసి, సిర్​సన్న, కచ్​కంటి తదితర గ్రామాలవారు వచ్చి ఓటేశారనే ఆరోపణలున్నాయి. మంచిర్యాలలో హమాలివాడలోని ఓటర్లకు బదులు వేరే గ్రామస్థులు వచ్చి ఓటేశారని బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సీసీసీ నస్పూర్​ సింగరేణి హైస్కూల్​ పోలింగ్​బూత్​లో టీఆర్ఎస్​ అభ్యర్థి తన కూతురిని ఏజెంట్​గా నియమించడం గొడవకు దారితీసింది. బీజేపీ నాయకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఏజెంట్​ను మార్చారు.

ఆదిలాబాద్​ పట్టణంలోని 45 వార్డు నెంబర్​లో బజార్​హత్నూర్​ మండలం దహెగాంతోపాటు పలు పల్లెటూర్ల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించడంతో ఆదిలాబాద్​ జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్​ శంకర్ ఆయా ఓట్లను మార్క్​ చేశారు. దహెగాం సర్పంచ్​ ఆదిలాబాద్​ బీజేపీ నాయకులకు సమాచారం ఇవ్వడంతో వారు గుట్టు రట్టు చేశారు. జరిగిన అక్రమాన్ని అదిలాబాద్​ఆర్డీవో సూర్యనారాయణకు ఫిర్యాదుచేయగా ఆయన విచారణ చేపట్టారు.

చేతులు లేకున్నా..

ఓటేందుకు వేయాలి… ఓటేస్తే మాకేం లాభమంటూ ప్రశ్నిస్తున్న ప్రస్తుత రోజుల్లో పలువురు దివ్యాంగులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. చేతులు లేకున్నా కాళ్లతోనే ఓటేశారు. అందరిలోనూ స్ఫూర్తి నింపారు. పలువురు వృద్ధులు సైతం కుటుంబీకులు, ఇతరుల సాయంతో పోలింగ్​ కేంద్రానికి తరలివచ్చి ఓటు వేశారు.  ఆదిలాబాద్‍ పట్టణానికి చెందిన రిటై‌‌‌‌ర్డు ఎంప్లాయి  ముత్యంరెడ్డికి  కంటిచూపు లేకపోయినా తన కొడుకుతో  పోలింగ్‌‌‌‌ కేంద్రానికి వచ్చి ఓటేశారు. విద్యుదాఘాతం వల్ల జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్​పేట్ కు చెందిన నరేష్‍  కాలితో ఓటేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓటు వేసిన తర్వాత మోచేతికి ఇంక్ వేయించుకున్నాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​కి చెందిన జాకీర్ పాషాకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.  తన రెండు కాళ్లను ఉపయోగిస్తూ అన్ని పనులు చేస్తుంటాడు. కాళ్లతోనే తన ఓటు హక్కును  వినియోగించుకున్నాడు.  చిన్నతనంలోనే రెండు చేతులు కోల్పోయినమంచిర్యాల పట్టణం రెండోవార్డుకు చెందిన సతీష్​ సైతం కాళ్లతోనే ఓటు హక్కును వినియోగించుకున్నాడు.