
- అలాట్ చేసి ఏడాదైనా.. ఇండ్లళ్లకు పోనిస్తలే..
- గతేడాది లబ్ధిదారులకు అలాట్‌మెంట్ పేపర్లు ఇచ్చిన మంత్రి కేటీఆర్
- అయినా ఇండ్లళ్లకు పోకుండా అడ్డుకుంటున్న లీడర్లు
హనుమకొండ, వెలుగు : డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని ఉన్న గుడిసెలు కూల్చేసిన్రు.. మూడేళ్ల కిందే ఇండ్లను పూర్తి చేసిన్రు.. లబ్ధిదారులకు కేటాయిస్తూ ఏడాది కింద ప్రొసీడింగ్స్ సైతం ఇచ్చిన్రు. కానీ లబ్ధిదారులు తమ ఇండ్లలోకి వెళ్లకుండా కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. దీంతో పేదలకు మళ్లీ గుడిసెలే దిక్కు కాగా, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కట్టిన డబుల్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
గుడిసెలు తీసి.. ఇండ్లు కట్టిన్రు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో సీఎం కేసీఆర్ వరంగల్‌లోని వివిధ స్లమ్ ఏరియాల్లో మూడు రోజుల పాటు పర్యటించారు. హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ కాలనీల్లో సుమారు 250 గుడిసెలు ఖాళీ చేయించి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆఫీసర్లు గుడిసె వాసులందరినీ ఖాళీ చేయించడంతో వారు మరో స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. అంబేద్కర్ నగర్ వద్ద 13 బ్లాకుల్లో 594 డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టే పనులు స్టార్ట్ చేసి మూడేళ్ల కింద పూర్తి చేశారు. కానీ లబ్ధిదారులకు అప్పగించే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. దీంతో తమకు ఇండ్లు ఎప్పుడు వస్తాయోనని పేదలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తునే ఉన్నారు.
ఏడాది కిందే ప్రొసీడింగ్స్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
డబుల్ బెడ్‌రూం ఇండ్లు పూర్తయినా తమకు కేటాయించకపోవడంతో పేదలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, కార్పొరేటర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు వినతిపత్రాలు సైతం అందజేశారు. దీంతో గతేడాది ఏప్రిల్ 20న వరంగల్, నర్సంపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కొందరికి ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేయడంతో పాటు 15 రోజుల్లో గృహ ప్రవేశం చేసుకోవాలని సూచించారు. కానీ తర్వాత కొందరు లీడర్లు లబ్ధిదారులకు ఫోన్ చేసి గృహ ప్రవేశం చేయొద్దని చెప్పారు. ఓ వైపు తాము గుడిసెలు వేసుకున్న స్థలం ఓనర్ ఖాళీ చేయాలని చెప్పడం, మరోవైపు డబుల్ ఇండ్లలోకి పోకుండా లీడర్లు అడ్డుకుంటుండడంతో లబ్ధిదారులు ఇండ్ల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన లీడర్లు తాత్కాలికంగా వారిని సముదాయించి, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు.
శిథిలావస్థకు చేరుకుంటున్న ఇండ్లు
ఇండ్ల నిర్మాణం పూర్తై మూడేండ్లు దాటుతున్నా వాటిని పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇండ్ల మధ్యలో భారీగా చెట్లు మొలిచాయి. ఇండ్ల తలుపులు, కిటికీలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పాటు ఆ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇండ్లు అప్పగించాలని పేదలు కోరుతున్నారు.