బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ

బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ
  • అలాంటి వాళ్లను అడ్డుకుంటే మాధవీలతకు 2 లక్షల మెజార్టీ వస్తది: జమాల్‌‌‌‌ సిద్ధిఖీ

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బుర్ఖాలలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జనాబ్ జమాల్ సిద్ధిఖీ ఆరోపించారు. అలాంటి వారిని అడ్డుకుంటే అసదుద్దీన్ ఒవైసీ ఓడిపోవడం ఖాయమన్నారు. బుర్ఖాలో వచ్చి దొంగ ఓట్లు వేసేవారిని బూత్‌‌‌‌‌‌‌‌లలోనే గుర్తిస్తే హైదరాబాద్‌‌‌‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కనీసం 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని పేర్కొన్నారు.

శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ముస్లింలను బద్నాం చేసేలా ఒవైసీ సోదరులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఒకప్పుడు తమకు నియోజకవర్గంలో కనీసం కార్యకర్తలు కూడా ఉండేవారు కాదని, ఇప్పుడు అలాంటి చోట్ల యువతతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఒకప్పుడు తాగడానికి నీళ్లు కూడా దొరికేవి కాదని, మోదీ వచ్చాక అమృత్ కాలం వచ్చిందన్నారు.

బీజేపీకి కొత్త ఓటర్లు, యువత మద్దతు ఉందన్నారు. భ్రష్టాచార్​ ముక్త్​ భారత్, పరివార్ ముక్త్ భారత్ కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ముస్లింకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, కానీ, ఓట్ల కోసం తమది ముస్లింల పార్టీ అంటూ కబుర్లు చెబుతున్నారని ఆయన ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.