- రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా.. ఇదీ బీజేపీ తీరంటూ ఫైర్
- కామారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి , వెలుగు : ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నెల రోజులుగా వరుసబెట్టి తమ మంత్రులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆమె ఫైరయ్యారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన కేసులో బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్ ఎంక్వైరీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. బీజేపీ వాళ్లు చాలా మాట్లాడుతున్నారని, రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా (రామ్ రామ్ అంటూనే పరాయి లీడర్ మా వాడనడం) అనేది బీజేపీ విధానమన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎదిగిన లీడర్లను గద్దల్లాగా ఎత్తుకుపోవడమే బీజేపీ పని అన్నారు.
‘‘ఇటీవలే టీఆర్ఎస్ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారు. వారిలో బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్ పేరు వినబడింది. ఆయనను విచారణకు రమ్మంటే ఎందుకంత భయం? మేం తప్పులు చేయలే అనోటోళ్లు కోర్టుకు ఎందుకు పోయిన్రు?” అని కవిత ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేయడం తప్ప బీజేపీకి మరో ఆలోచన లేదనన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైనా ఆమె విమర్శలు చేశారు. దక్షిణ తెలంగాణ మునుగోడులో ఉప ఎన్నిక ఉంటే ఉత్తర తెలంగాణలో ఆయన పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు.