బోనస్‌ హామీని బోగస్‌‌ చేసిన్రు

  • గతంలో అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నొడ్లకే పరిమితం చేశారు
  • ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా పత్తి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు
  • మాజీమంత్రి హరీశ్‌‌రావు

ఖమ్మం, వెలుగు : రైతులకు ఇవ్వాల్సిన బోనస్‌‌ను కాంగ్రెస్‌‌ ప్రభుత్వం బోగస్‌‌గా మార్చిందని మాజీమంత్రి హరీశ్‌‌రావు విమర్శించారు. వరి సాగు చేసిన ప్రతి రైతుకు క్వింటాల్‌‌కు రూ. 500 బోనస్‌‌ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్‌‌.. ఇప్పుడు సన్నాలకే పరిమితం చేసిందని మండిపడ్డారు. మాజీమంత్రులు పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి శుక్రవారం ఖమ్మం అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌లో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌‌రావు మాట్లాడుతూ వరంగల్‌‌ రైతు డిక్లరేషన్‌‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌‌ అమలు చేయలేదన్నారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. 

మార్కెట్లలో కనీసం మద్దతు ధర కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఖమ్మం మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారమే.. ఈ రెండు నెలల్లో ఒక్క రైతుకు కూడా రూ.7,521 మద్దతు ధర దక్కలేదని, క్వింటాల్‌‌కు రూ.6,500 ధర దాటలేదన్నారు. రైతులు క్వింటాల్‌‌కు రూ. వెయ్యి చొప్పున నష్టపోతున్నారన్నారు. దళారులు పత్తిని రూ.6,500కు క్వింటాల్‌‌ చొప్పున కొని, సీసీఐ కేంద్రాల్లో రూ.7,500కు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 

ఖమ్మం పత్తి మార్కెట్‌‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌‌ చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని హరీశ్‌‌రావు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల టన్నుల సన్నరకం వడ్లు పండితే ఇప్పటివరకు 19 వేల టన్నులు మాత్రమే కొన్నారన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి మద్యం అమ్మకాలపై రివ్యూ చేస్తున్నారు తప్పితే పత్తి, వరి కొనుగోళ్లపై చేయడం లేదన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌‌రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, చంద్రావతి, జడ్పీ మాజీచైర్మన్‌‌ కమల్‌‌రాజు ఉన్నారు.

ఎక్స్‌‌ట్రాలు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం

బీఆర్ఎస్స్‌‌ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టే పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హరీశ్‌‌రావు అన్నారు. ఆఫీసర్లు పార్టీకి కాకుండా చట్టం, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని సూచించారు. తప్పుడు కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని, 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్కదానినైనా పూర్తి చేశారా ? అని ప్రశ్నించారు. 

మహిళలకు రూ.2,500, రైతు బంధు, డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు, రూ.5 లక్షల విద్యార్థి భరోసా, రూ.4 వేల పెన్షన్‌‌ హామీలు ఏమయ్యాయన్నారు. కేసీఆర్​ హయాంలో కరోనా టైంలోనూ రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్‌‌ అని మండిపడ్డారు. అదానీని అరెస్ట్‌‌ చేయాలని రాహుల్‌‌ గాంధీ అంటున్నారని, అదానీ నుంచి రూ.100 కోట్ల చెక్కు తీసుకున్న రేవంత్‌‌రెడ్డిని ఏం చేయాలని ప్రశ్నించారు.