- ముఠాను పట్టుకున్న పోలీసులు
మిడ్జిల్, వెలుగు : రాగి చెంబులకు రేడియేషన్ చేస్తే బంగారంగా మారతాయని నమ్మించి రూ. 71 లక్షలు కాజేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ ఎస్పీ నరసింహ కేసు వివరాలను వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన రంగస్వామి అనే వ్యక్తి ముఠాను ఏర్పాటు చేసి అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవాడు. రాగి చెంబులకు రేడియేషన్ చేస్తే బంగారంగా మారుతుందని, ఆ బంగారం అమ్మితే రూ. కోట్లు వస్తాయని జనాలను నమ్మించేవాడు.
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, కడ్తాల్ మండలాలకు చెందిన నరేశ్ , శేఖర్, జంగయ్య, మహేశ్, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మల్లాపూర్ కు చెందిన వివేకానందగౌడ్ ను ఇలానే నమ్మించి రూ.71 లక్షల వరకు వసూలు చేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు గత నెల 21న మిడ్జిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిడ్జిల్ మండలానికి నిందితులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు శనివారం మున్ననూరు టోల్ గేట్ వద్ద వలపన్ని ముఠాను పట్టుకున్నారు.
విచారణలో ఏ1 నిందితుడు రంగస్వామి బాధితుల దగ్గర వసూలు చేసిన డబ్బులతో తన సొంత ఊరిలో 4.8 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తేలింది. ఏ2 నిందితురాలు భార్గవి పరారీలో ఉంది. నిందితుల నుంచి మూడు వాహనాలు, రూ.2000, 500 నకిలీ కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులు మహేశ్, లక్ష్మణ్, జడ్చర్ల సీఐ జములప్ప,ఎస్‌ఐలు జయప్రసాద్,రాంలాల్, శ్రీనివాస్ ను ఎస్పీ అభినందించారు.