అలంపూర్ లో పెట్టుబడికి డబుల్‌‌‌‌ ఇస్తామంటూ...రూ. 8.67 లక్షలు వసూలు

అలంపూర్ లో పెట్టుబడికి డబుల్‌‌‌‌ ఇస్తామంటూ...రూ. 8.67 లక్షలు వసూలు

అలంపూర్, వెలుగు : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో రిటర్న్‌‌‌‌ వస్తుందని నమ్మించిన సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ. 8.67 లక్షలు వసూలు చేశారు. వివరాల్లోకి వెళ్తే... గద్వాల జిల్లా అలంపూర్‌‌‌‌ మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన విష్ణు వాట్సప్‌‌‌‌కు గతేడాది మార్చి 4న ఓ లింక్‌‌‌‌ వచ్చింది. అది ఓపెన్‌‌‌‌ చేయగా టెలిగ్రామ్‌‌‌‌ యాప్‌‌‌‌లో ‘క్యూకో’ అనే గ్రూప్‌‌‌‌లో విష్ణు నంబర్‌‌‌‌ యాడ్‌‌‌‌ అయింది. 

తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు రూ. 1000 పెట్టుబడి పెడితే రూ. 1,300 లాభం వస్తుందని గ్రూప్‌‌‌‌లో   మెసేజ్‌‌‌‌ చేయడంతో విష్ణు పెట్టుబడి పెట్టాడు. వెంటనే అతడి అకౌంట్‌‌‌‌లో రూ.1,300 పడ్డాయి. దీంతో నిజమేనని నమ్మిన అతడు తర్వాత రూ. 3 వేలు, రూ. 4 వేలు పెట్టుబడిగా పెట్టాడు. కానీ రిటర్న్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ రాలేదు. దీంతో తన అమౌంట్‌‌‌‌ను తిరిగి ఇవ్వాలని కోరగా... ఇంకా కొన్ని డబ్బులు పెట్టుబడి పెడితే మొత్తం తిరిగి వస్తుందని నమ్మించారు. దీంతో విష్ణు విడతల వారీగా పెట్టుబడి పెడుతూ వచ్చాడు. 

మొత్తం రూ. 8.67 లక్షలు పెట్టుబడి పెట్టినా డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు. మంగళవారం అలంపూర్‌‌‌‌ పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.