- ఆయుష్మాన్ భారత్ పేదల ఆయుష్షుతగ్గిస్తున్నది: కడియం కావ్య
- అరకొర నిధులతో ఇబ్బంది పెడ్తున్నరు
- లోక్‌సభలో కేంద్రంపై వరంగల్ ఎంపీ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హెల్త్ స్కీమ్‌ల పేర్లు మారుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తూ పబ్బం గడుపుతున్నదని వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పేరిట తీసుకొచ్చిన స్కీమ్.. పేదల ఆయుష్షు పెంచేందుకు ఉపయోగపడటం లేదన్నారు. అరకొర నిధులు వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు.
లోక్‌సభలో బడ్జెట్లో వైద్య ఆరోగ్య పద్దులపై కాంగ్రెస్ తరఫున ఆమె చర్చలో పాల్గొని మాట్లాడారు. ‘‘కొవిడ్ మేనేజ్మెంట్లో భారీ విజయం సాధించామని కేంద్రం జబ్బలు చరుచుకుంటున్నది. కానీ.. గ్రౌండ్ లెవల్లో చూసుకుంటే పరిస్థితి భిన్నంగా ఉన్నది. ఆరోగ్య రంగంలో కేంద్రం చేస్తున్నదేమీ లేదు. మా నాన్న కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు బాలికల సమస్యలపై చిత్తశుద్ధితో సేవలందించారు.
క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడిన కుటుంబం ఆర్థికంగా చితికిపోతున్నది. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మొదలుకొని.. నివారణకు వరకు చేపట్టే చర్యల్లో రాయితీలు కల్పించాలి’’అని కావ్య అన్నారు.
లీకేజీలోనూ పథకాలు తెస్తారెమో...
నీట్ ఎగ్జామ్‌పై ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కావ్య తప్పుబట్టారు. నీట్ ఒక ప్రయోగాత్మక లీకేజీ అని ఎద్దేవా చేశారు. లీకేజీ యోజన రూపంలో కూడా పథకాలు వస్తాయోమోనని వ్యంగంగా అన్నారు. ‘‘తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10లక్షలు కేటాయిస్తున్నది. నేను ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించుకుంటున్నం. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మిషన్ ద్వారా కేంద్రం నుంచి రూ.323 కోట్లు రావాల్సి ఉన్నయ్. వాటిని వెంటనే రిలీజ్ చేయండి’’అని కావ్య అన్నారు.